అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారతదేశ ఇంధన నిల్వలపై కేంద్ర ప్రభుత్వం కీలక వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 74 రోజులకు సరిపడా ముడి చమురు మరియు పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి సోమవారం రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలిపారు. ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురై సరఫరా నిలిచిపోయినా, దేశ అవసరాలకు ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (SPR) కేంద్రాల్లో 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వ ఉంది, ఇది 9.5 రోజుల అవసరాలను తీరుస్తుంది. దీనికి అదనంగా, దేశంలోని వివిధ చమురు మార్కెటింగ్ సంస్థల (OMCs) వద్ద 64.5 రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి. వెరసి మొత్తం 74 రోజుల నిల్వలు భారత్ వద్ద సిద్ధంగా ఉన్నాయి. చమురు నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు ఒడిశాలోని చండీఖోల్, కర్ణాటకలోని పాడూర్ వద్ద కొత్త ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్రం ఇప్పటికే ఆమోదం తెలిపింది. ఇవి పూర్తయితే మరో 12 రోజుల అదనపు నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గిస్తూనే, సరఫరా మార్గాలను విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి పేర్కొన్నారు. గత ఐదేళ్ల గణాంకాల ప్రకారం భారత్ ముడి చమురు కోసం 85 నుండి 88 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. 2025 ఏప్రిల్ నాటికి దేశంలో 423.1 మిలియన్ మెట్రిక్ టన్నుల ముడి చమురు, 595.4 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువు నిల్వలను వెలికితీసేలా అన్వేషణ సాగుతోందని మంత్రి వివరించారు. అంతర్జాతీయ సంస్థలతో దౌత్యపరమైన సంబంధాలను పటిష్ఠం చేసుకోవడం ద్వారా ఇంధన భద్రతకు భరోసా ఇస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.