ఇరాన్‌పై జరిగిన దాడుల్లో మినాబ్ ప్రాథమిక పాఠశాల చిన్నారులు బలికావడంపై ఇరాన్ మద్దతు ఉన్న ‘టెహ్రాన్ టైమ్స్’ పత్రిక తీవ్రంగా స్పందించింది. ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్-అమెరికా జరిపిన మొదటి రోజు దాడుల్లో మరణించిన 160 మంది బాలికల ఫోటోను ప్రచురిస్తూ.. ‘‘ట్రంప్, వారి కళ్లలోకి చూడు’’ అనే శీర్షికతో సంచలన కథనాన్ని రాసింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని, అది ఇరాన్ వైఫల్యమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనలను ఆ పత్రిక తీవ్రంగా ఖండించింది. బాధ్యత నుంచి తప్పించుకోవడమే కాకుండా, దౌత్య పరిష్కారాలను ధిక్కరించే ధోరణిని ట్రంప్ ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
మొదట ఈ దాడిపై ఆరోపణలు పరస్పరం చేసుకున్నప్పటికీ, న్యూయార్క్ టైమ్స్ మరియు డచ్ ఫ్యాక్ట్ చెక్ సంస్థ ‘బెల్లింగ్‌క్యాట్’ పరిశోధనల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మినాబ్‌లోని పాఠశాలపై పడింది అమెరికా తయారీ ‘టోమాహాక్’ (Tomahawk) క్రూయిజ్ క్షిపణి అని రసెర్చర్ ట్రవోర్ బాల్ నిర్ధారించారు. టోమాహాక్ క్షిపణులను కలిగి ఉన్న ఏకైక దేశం అమెరికా మాత్రమేనని, ఇజ్రాయెల్ వద్ద ఇవి లేవని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ వార్తా సంస్థ ‘మెహర్ న్యూస్’ విడుదల చేసిన వీడియోలోని క్షిపణి శకలాలు, టోమాహాక్ మిసైల్‌తో సరిపోలడం ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది.
మినాబ్‌లోని సైనిక కాంపౌండ్‌ను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడిలో పక్కనే ఉన్న పాఠశాలపై బాంబుల వర్షం కురవడంతో 165 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ 160 మంది చిన్నారులను ఇరాన్ ప్రభుత్వం ఒకే చోట ఖననం చేసి, వారికి నివాళులర్పించింది. ఫిబ్రవరి 28 నుండి మొదలైన ఈ యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో సామాన్య ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఎటువైపు నుండి ఏ డ్రోన్ లేదా క్షిపణి వచ్చి పడుతుందో తెలియని భీతావాహ పరిస్థితులు నెలకొన్నాయి.