పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష! మహబూబాబాద్ ఫంక్షన్ హాల్ ఓనర్ షాకింగ్ బోర్డు.. సెక్షన్ 441 ఏం చెబుతోంది?

పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ వస్తే చాలు.. ఆహ్వానం లేకుండానే భోజనాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువేమీ కాదు. అయితే ఇలాంటి ‘పిలవని పేరంటాల’కు చెక్ పెట్టేందుకు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని అశోక్ నందన్ ఫంక్షన్ హాల్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఫంక్షన్ హాల్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఒక బోర్డులో.. “ఫంక్షన్‌కు సంబంధం లేని వ్యక్తులు లోపలికి వచ్చి దొరికితే సెక్షన్ 441 ప్రకారం 3 నెలల జైలు శిక్ష మరియు రూ. 5,000 జరిమానా విధిస్తాం” అని స్పష్టంగా రాసి ఉంది. ఈ బోర్డు ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

సాధారణంగా ఇలాంటి ప్రదేశాల్లో “అపరిచితులకు ప్రవేశం లేదు” అనే బోర్డులు చూడటం సహజం, కానీ సెక్షన్లను ప్రస్తావిస్తూ కఠిన చర్యల గురించి హెచ్చరించడం చర్చకు దారితీసింది. భారత శిక్షాస్మృతి (IPC) లోని సెక్షన్ 441 అనేది ‘క్రిమినల్ ట్రెస్‌పాస్’ (అక్రమ చొరబాటు) గురించి వివరిస్తుంది. అంటే, ఒక వ్యక్తి లేదా సంస్థకు చెందిన ప్రైవేట్ ఆస్తిలోకి వారి అనుమతి లేకుండా ప్రవేశించడం లేదా అక్కడ నేరపూరిత ఉద్దేశంతో ఉండటం చట్టరీత్యా నేరం. ఫంక్షన్ హాల్ యాజమాన్యం ఈ సెక్షన్‌ను ఆయుధంగా చేసుకుని, ఆహ్వానం లేని వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోంది.

న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రైవేట్ ఈవెంట్లలో యజమాని అనుమతి లేకుండా ప్రవేశించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఆహ్వానం లేకపోయినా కేవలం భోజనాల కోసం వెళ్లి దొరికిపోతే, అది అక్రమ చొరబాటు కిందకే వస్తుందని, యజమాని ఫిర్యాదు చేస్తే జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, మహబూబాబాద్ ఫంక్షన్ హాల్ పెట్టిన ఈ బోర్డు ఇప్పుడు స్థానికంగా భోజన ప్రియులను ఆలోచనలో పడేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *