దేశవ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు గడువు నేటితో ముగియనుంది. గురువారం చివరిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు సీట్లు అభ్యర్థులను ఎంపిక చేసింది కాంగ్రెస్ హైకమాండ్. ఒకరు కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ కాగా, మరొకరు వేం నరేందర్‌రెడ్డి. ఆయా నేతల పేర్లను ఖరారు చేసినట్టు తెలుస్తోంది.
రాజ్యసభ ఎన్నికల నామినేషన్లు నేడు చివరి రోజు
తెలంగాణ నుంచి ఖాళీ అయిన రెండు రాజ్యసభ సీట్లకు దాదాపు డజను మంది నేతలు పోటీ పడ్డారు. కొందరు నేతలు తమకున్న పలుకుబడితో ఢిల్లీ స్థాయిలో పైరవీలు చేశారు. ఈ వ్యవహారంపై బుధవారం ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పార్టీ హైకమాండ్‌తో సుధీర్ఘంగా చర్చించారు.
పార్టీ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఛాన్స్ ఇవ్వాలని హైకమాండ్ భావించినట్టు తెలుస్తోంది. ఇక తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్ రెడ్డిని ఎంపిక చేసినట్లు సమాచారం. దీంతో ఈ నేతలకు పెద్దల సభకు వెళ్లే అవకాశం దక్కింది. వీరిద్దరు గురువారం తమ తమ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తెలంగాణ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఛాన్స్
తనకు రాజ్యసభ సీటు కేటాయించిన విషయం తెలియగానే వేం నరేంద్ రెడ్డి ఉబ్బితబ్బిబ్బయ్యారు. రాజ్యసభ అభ్యర్థిగా తనను ప్రకటించిన నేపథ్యంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి, అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణలో పార్టీ నేతలతో వేం నరేందర్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన గురించి ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. బుధవారం రాత్రి అభ్యర్థుల గురించి హైకమాండ్ ప్రకటన వస్తుందని నేతలు భావించారు, కానీ రాలేదు. ఒకవేళ బీఆర్ఎస్ తన అభ్యర్థిని రంగంలోకి దించితే రెండో సీటుకు పోటీ తప్పనిసరి. లేకుంటే రెండు స్థానాలను అధికార కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం చేసుకోనుంది.
ఇంతకీ వేం నరేందర్‌రెడ్డి ఎవరు? మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పనపల్లికి చెందినవారు. తల్లిదండ్రులు వెంకటమ్మ- చెన్నకృష్ణారెడ్డిలకు 1960 డిసెంబరు 26న జన్మించిన జన్మించారు. వరంగల్‌లోని సీకేఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఎంఏ పొలిటికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకున్నారు. రాజకీయాలపై ఆసక్తితో తొలుత టీడీపీలో ఆయన చేరారు.
ఆ తర్వాత రేవంత్‌రెడ్డితో ఆయనకు సాన్నిహిత్యం ఏర్పడింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చే ప్రక్రియలో ఆనాటి నుంచి రేవంత్‌రెడ్డి వెంట ఉన్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సలహాదారునిగా నియమితులయ్యారు. ఇప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టనున్నారు.