తెలంగాణలోని రాజ్యసభ సీట్ల భర్తీ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఆశావహులు అత్యధికంగా ఉండటంతో ఫిల్టర్ చేయడం సవాల్ గా మారింది. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఏకంగా 16 మందితో కూడిన జాబితాను పీసీసీ అందచేశారు. ఆ లిస్టును చూసి రాహుల్ కూడా షాకయ్యారట. కాంపిటేషన్ లో ఇంత మంది లీడర్లా? అంటూ ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో అభ్యర్ధులను ఫిల్టర్ చేసి ప్రకటిస్తామని రాహుల్ చెప్పారు. అయితే రాజ్యసభ సీట్ల కోసం హేమా హేమీలు పోటీ పడుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎవరిని వరిస్తుందనేది సస్పెన్స్ గా మారింది. బుధవారం ఏఐసీసీ నుంచి అధికారికంగా పేర్లు రిలీజ్ అవుతాయని పార్టీ వర్గాలు తెలిపాయి.
సామాజిక సమీకరణాలే కీలకం..
గతంలో రాజ్యసభ సీటును బీసీ, ఓసీ సామాజిక వర్గాలకు కేటాయించారు. ఓసీ నుంచి రేణుకా చౌదరి, బీసీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ లకు అవకాశం కల్పించారు. దీంతో ఈ దఫా రెడ్డి, ఎస్సీ నుంచి ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. రెడ్డి సామాజిక వర్గం లో వంశీచందర్ రెడ్డి, వేం నరేందర్ లు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. యువనేతగా,ఏఐసీసీ అధిష్టానానికి సన్నిహితుడిగా వంశీ పేరు వినిపిస్తుండగా, ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తుడిగా వేం నరేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. ఇక సామాజిక న్యాయం ప్రకారం ఈసారి దళిత నేతకు అవకాశం ఇవ్వాలనే డిమాండ్ బలంగా వెల్లువెత్తుతుంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, సీనియర్ నేత దొమ్మాటి సాంబయ్య పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికి ఇచ్చినా దక్షిణ తెలంగాణ ,ఉమ్మడి వరంగల్ సమీకరణాలు మారతాయనే అభిప్రాయం పార్టీలో జరుగుతుంది.
మధుయాష్కీ గౌడ్ కూడా..
మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీ గౌడ్, వీహెచ్ (హనుమంతరావు), డాక్టర్ వినయ్ కుమార్ కూడా ఉన్నారు. అయితే గతంలో బీసీలకు అవకాశం ఇచ్చినందున, ఈసారి ఇతర వర్గాలకు మొగ్గు చూపే అవకాశం ఉన్నదని పార్టీలోని సీనియర్లు చెప్తున్నారు. అయితే మధుయాష్కీ గౌడ్ కూడా ఏఐసీసీకి సన్నిహితంగా ఉండే లీడర్. వీ హెచ్ సీనియర్ నేతగా సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నారు. మాజీ కేంద్రం మంత్రి పీ శివ శంకర్ కుమార్ కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్ కూడా ప్రధాన రేసులో ఉన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ డాక్టర్ గా వైద్యసేవలందిస్తూ, పార్టీ కోసం ఏళ్ల తరబడి నుంచి వర్క్ చేస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఈయన బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
అందరూ అర్హులే ..రెండేళ్లు పూర్తి…?
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినోళ్లకు రెండేళ్ల వరకు మరే ఇతర పదవులు ఉండవని పార్టీ గతంలో నియమ నిబంధనలు విధించింది. గతంలో ఇచ్చిన పదవుల్లో ఈ క్రైటేరియా పాటించారు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయింది. అంటే గతంలో పోటీ చేసి ఓడిపోయిన నేతల గడువులు కూడా ముగిశాయి. దీంతో ఇక నుంచి వచ్చే నామినేటెడ్ పదవులకు అందరూ అర్హులే అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో పదవులపై ఇక పుల్ కాంపిటేషన్ నెలకొననున్నది. రాబోయే కాలంలోని ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్లకూ డిమాండ్ భారీగా ఉండనున్నది. రాజ్యసభ లిస్టులోనూ గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు పొంది ఓడిపోయిన నేతలు ఉండటం గమనార్హం.