కొడాలి ఈజ్ బ్యాక్..! వైసీపీకి ఆందోళన ఎందుకంటే..?

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని వివాదస్పద మాటలతో గతంలో నిత్యం వార్తల్లో నిలిచారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ఏంతో అనుభవం ఉన్న చంద్రబాబు పట్ల పలుష పదజాలంతో తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు లోకేశ్ పైనా మాటల తూటాలు పేల్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. నానినే ఫస్ట్ టార్గెట్ గా మారారు. దీంతో గత కొంతకాలంగా కొడాలి సైలెంట్ అయిపోయారు. అయితే అనూహ్యంగా మళ్లీ తెరపైకి వచ్చిన ఆయన.. మునుపటి రోజులను గుర్తుచేస్తూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయితే ఈ పరిణామం టీడీపీ కంటే వైసీపీ నేతలు, శ్రేణులనే కాస్తంతా ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది.

 

వ్యూహాత్మకంగా సైలెంట్..

ఎన్నికల ఫలితాల అనంతరం కూటమి ప్రభుత్వ టార్గెట్ తానే అని తెలిసి.. మాజీ మంత్రి కొడాలి నాని సైలెంట్ అయ్యారు. వల్లభనేని వంశీ తరహాలో తనను అరెస్టు చేస్తారని భావించి.. అనారోగ్యం పేరుతో గుండె ఆపరేషన్ చేయించుకున్నారు. అప్పటి నుంచి విశ్రాంతి తీసుకుంటూ నెలల తరబడి ఆయన మీడియా ముందుకు రాలేదు. ఒకప్పుడు వైసీపీకి ప్రధాన మాటల అస్త్రంగా ఉన్న కొడాలి.. వ్యూహాత్మకంగా సెలైంట్ అవ్వడం వైసీపీని సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే వైసీపీ అధికారం కోల్పోవడానికి ప్రధాన కారకుల్లో కొడాలి నాని సైతం ఉన్నారన్న అభిప్రాయం ఉండటంతో నాని ప్రెజెన్స్ లేకపోయినా వైసీపీ శ్రేణులు పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.

 

కొడాలి ఈజ్ బ్యాక్..

జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రి అంబటి రాంబాబును కొడాలి నాని తాజాగా పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసిన ఘాటు విమర్శలు.. మునుపటి జోష్ ను గుర్తుచేసింది. ‘మీ ఎర్ర బుక్కులకు, పసుపు బుక్కులకు ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరు. వైఎస్ఆర్‌సీపీలో ఎవ్వరూ తగ్గేదేలే. మమ్మల్ని భయపెట్టాలని చూడకు’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదే సమయంలో రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొస్తూ ఆ బుక్ లో జగన్ పేరు ఉంటే నీకే ప్రమాదం.. లేదా జగన్ బుక్ లో నీ పేరు ఉన్నా నీకే ప్రమాదం అంటూ బాలకృష్ణ డైలాగ్ చెప్పారు. దీంతో ఇన్నాళ్లు సిక్ లీవ్ లో అరెస్టుకు దూరంగా ఉన్న కొడాలి నాని.. ఆరోగ్యంతో తిరిగివచ్చారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

 

వైసీపీకి ఆందోళన ఎందుకంటే?

మాస్ లీడర్ గా పేరున్న కొడాలి నాని వంటి నేత ప్రభుత్వంపై మాటల దాడి చేస్తే సాధారణంగా వైసీపీ నేతలు హర్షించాలి. ఈ క్రమంలోనే కొందరు నాని కమ్ బ్యాక్ ను స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం టెన్షన్ కు గురవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే సీఎం చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు.. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను తెచ్చిపెట్టాయని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే పెద్ద ఎత్తున అంబటి ఇంటిపై దాడి జరిగినా ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో రియాక్షన్ రాలేదని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు కొడాలి నాని మునుపటిలా వచ్చి మళ్లీ చంద్రబాబు, లోకేశ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. పార్టీకి మరింత డ్యామేజ్ అయ్యే ప్రమాదముందని వారు అభిప్రాయపడుతున్నారు. పైగా ఇప్పుడు ఆరోగ్యంగానే కనిపిస్తున్నందున తిరిగి ఆయన్ను జైలుకు పంపే యోచనను ప్రభుత్వం చేయవచ్చన్న అనుమానాలు సైతం వైసీపీలో మెుదలైనట్లు తెలుస్తోంది. మెుత్తంగా కొడాలి నాని చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చి.. పెద్ద చర్చకు కారణమయ్యారని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *