చిత్తూరు జిల్లా కుప్పంలో భారీగా గంజాయి పట్టుబడింది. అంతరాష్ట్ర ముఠా భారీ ఎత్తున మాదకద్రవ్యాలను తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితులు కోల్కతా నుండి కేరళకు సుమారు 40 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తుండగా కుప్పం పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అనుమానాస్పదంగా కనిపించిన వాహనాలను సోదా చేయగా.. ఈ భారీ నిల్వలు బయటపడ్డాయి. పట్టుబడిన గంజాయి విలువ మార్కెట్లో లక్షల్లో ఉంటుందని అంచనా.
ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో కొందరు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులను విచారించగా, పోలీసుల కళ్లు గప్పి సుదూర ప్రాంతాలకు ఈ మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
కుప్పం పరిసర ప్రాంతాల్లో నిఘా పెంచిన పోలీసులు, గంజాయి నెట్వర్క్ను పూర్తిగా ఛేదించే పనిలో పడ్డారు. ఈ ముఠా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు? వీరికి స్థానికంగా ఎవరైనా సహకరిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఆపరేషన్ను విజయవంతం చేసిన పోలీస్ సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.