సరిహద్దుల్లో పాకిస్థాన్ సాగిస్తున్న ప్రచ్ఛన్న యుద్ధంపై భారత సైన్యం తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. గతంలో పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ఒక ఎత్తు అయితే, ఈసారి చేపట్టబోయే ప్రతిస్పందన ‘ఆపరేషన్ సిందూర్ 2.0’ ఊహకు అందనంత భయంకరంగా ఉంటుందని వెస్ట్రన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ స్పష్టం చేశారు. నేరుగా యుద్ధం చేసే ధైర్యం లేక ఉగ్రవాదుల ద్వారా ముసుగు దాడులకు పాల్పడుతున్న పాక్ తీరును ఆయన తీవ్రంగా ఎండగట్టారు.
గతంలో భారత క్షిపణులు పాక్ వైమానిక స్థావరాలను, పీఓకే (POK) లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినప్పుడు పాక్ సైన్యం ఏ విధంగా భయపడిందో ఆయన గుర్తుచేశారు. అప్పట్లో కాల్పుల విరమణ కోసం భారత కాళ్లపై పడిన చరిత్ర పాకిస్థాన్‌కు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం పాక్ ఒక దుర్భరమైన, బలహీనమైన స్థితిలో ఉందని, అయినప్పటికీ తన వక్రబుద్ధిని మార్చుకోకపోతే ఈసారి భారత సైన్యం ఇచ్చే దెబ్బ మరింత బలంగా, విధ్వంసకరంగా ఉంటుందని కటియార్ హెచ్చరించారు.
పరిస్థితిని బట్టి ఎంతటి కఠిన నిర్ణయానికైనా భారత్ వెనుకాడదని, శత్రువు ఊహించని రీతిలో ప్రతీకారం ఉంటుందని లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ కుమార్ కటియార్ స్పష్టం చేశారు. దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, సరిహద్దు దాటి వస్తే ప్రాణాలు దక్కవని ఆయన తేల్చి చెప్పారు. పాకిస్థాన్ తన తీరు మార్చుకోకపోతే మరోసారి తీవ్ర నష్టాన్ని చవిచూడక తప్పదని భారత సైన్యం పక్షాన ఆయన గట్టి హెచ్చరికలు పంపారు.