మా పిల్లలకు ఆ టీచరే కావాలి: ఆదిలాబాద్‌లో బడికి తాళం వేసిన తల్లిదండ్రులు

ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలిని వేరే గ్రామానికి డిప్యుటేషన్‌పై పంపడాన్ని నిరసిస్తూ గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తాళం వేశారు. 63 మంది విద్యార్థులు ఉన్న ఈ ప్రాథమిక పాఠశాలలో కేవలం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే ఉండగా, అందులో ఒకరిని వారంలో మూడు రోజులు డోర్లి గ్రామ పాఠశాలకు కేటాయించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లల చదువు కుంటుపడుతోందని, ఉన్న టీచర్‌ను ఇక్కడే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పాఠశాల గేటు ముందు బైఠాయించారు.

ఈ ఘటన తెలుసుకున్న మండల విద్యాధికారి (MEO) వెంకట్ రావు ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్థులతో చర్చలు జరిపారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన హామీ లభించే వరకు ఆందోళన విరమించేది లేదని తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. తమ విన్నపాన్ని ఇప్పటికే కలెక్టర్‌కు, విద్యాశాఖకు తెలిపినా ఫలితం లేదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని వారు వెల్లడించారు. చర్చలు సఫలం కాకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిపోయారు, దీంతో పాఠశాల ఆవరణ పూర్తిగా బోసిపోయింది.

ప్రభుత్వం ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తామని చెబుతూనే, ఉన్న ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు పంపడం అన్యాయమని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధ్యాయురాలి డిప్యుటేషన్‌ను తక్షణమే రద్దు చేయకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యా సంవత్సరం ముగిసే సమయానికి ఇలాంటి మార్పులు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈవో స్పందిస్తూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *