హిందూ ఆచారాలను జగన్ అవమానించారు: పూజారి ఇచ్చిన తీర్థం కింద పడేశారన్న టీడీపీ ఎమ్మెల్యే ఆరోపణలు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. పులివెందుల నియోజకవర్గంలోని నందిపల్లి గ్రామంలో జరిగిన నందీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేక వేడుకల్లో జగన్ హిందూ మతాచారాలను అవహేళన చేశారని ఆయన విమర్శించారు. పూజారి భక్తితో ఇచ్చిన తీర్థాన్ని జగన్ స్వీకరించకుండా కిందకు వదిలేశారని, ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీయడమేనని ఎమ్మెల్యే మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, జగన్ తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

జగన్‌కు దైవంపై ఎటువంటి భక్తి లేదని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలయాలకు వెళ్తున్నారని ఎంఎస్ రాజు ఆరోపించారు. పూజ సమయంలో గోత్ర నామాలు చెప్పకుండా నిర్లక్ష్యం వహించడమే కాకుండా, అగ్నిగుండంలో వేయాల్సిన వస్తువులను తిరిగి పూజారికే ఇవ్వడం ఆయన అహంకారానికి నిదర్శనమని విమర్శించారు. గత ఐదేళ్ల పాలనలో దాదాపు 2,000 ఆలయాలపై దాడులు జరగడం వెనుక జగన్ వైఖరే కారణమని, టీటీడీకి పట్టువస్త్రాలు సమర్పించే సమయంలో కూడా కుటుంబ సమేతంగా వెళ్లకుండా సంప్రదాయాలను విస్మరించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు.

హిందూ మత విశ్వాసాలపై గౌరవం లేని వ్యక్తులను టీటీడీ చైర్మన్‌లుగా నియమించి ఆ పవిత్ర సంస్థను అప్రతిష్ట పాలు చేశారని రాజు ధ్వజమెత్తారు. “నిజంగా భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడు గుడికి వెళ్లాల్సిన అవసరం ఏముంది?” అని ఆయన ప్రశ్నించారు. జగన్ తన కక్షపూరిత వైఖరిని వీడి, ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను గాయపరిచినందుకు ఆ దేవుడే జగన్‌కు శిక్ష విధిస్తాడని ఆయన శాపనార్థాలు పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *