శ్రీవారి దర్శనం వివాదం: హీరోయిన్ శివాని నాగారం వివరణ….

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఫేమ్ శివాని నాగారం ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. ఒక పాడ్‌కాస్ట్‌లో తనకు “15 నిమిషాల పాటు దర్శనం లభించింది” అని ఆమె చెప్పడంతో, సాధారణ భక్తులకు కనురెప్పపాటు కాలం కూడా ఇవ్వని టీటీడీ, సెలబ్రిటీలకు ఇంత సమయం ఎలా కేటాయిస్తుందంటూ భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ నిబంధనల అమలుపై కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది.

ఈ నేపథ్యంలో శివాని ఒక వీడియో సందేశం ద్వారా అసలు విషయాన్ని స్పష్టం చేశారు. తాను 15 నిమిషాల పాటు గర్భాలయంలోనే ఉన్నానని చెప్పలేదని, క్యూ లైన్ ప్రారంభం నుండి స్వామి వారిని చూస్తూ లోపలికి వెళ్లి వచ్చే వరకు పట్టిన మొత్తం సమయాన్ని ఉద్దేశించి ఆ మాట అన్నానని వివరించారు. భక్తుల రద్దీని బట్టి క్యూ మూవ్ అవుతున్నప్పుడు స్వామివారు దూరం నుండి కొంచెం కొంచెం కనిపిస్తారని, ఆ అనుభూతినే తాను పంచుకున్నానని ఆమె పేర్కొన్నారు.

తనకు ఎలాంటి ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించలేదని, తాము సాధారణ భక్తుల లాగే శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు కొనుగోలు చేసి లైన్‌లో నిల్చుని దర్శనం చేసుకున్నామని శివాని స్పష్టం చేశారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, ఎవరినైనా ఉద్దేశపూర్వకంగా బాధపెట్టి ఉంటే క్షమించాలని ఆమె కోరారు. ఈ వివరణతో గత కొన్ని రోజులుగా తిరుమల దర్శనంపై సాగుతున్న వివాదానికి తెరపడినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *