ప్రపంచ యాత్రికుడిగా గుర్తింపు తెచ్చుకున్న ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. హిందూ దేవతలపై, భారతీయ సంస్కృతిపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఒకప్పుడు లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న అన్వేష్, తన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కరాటే కళ్యాణి సహా పలువురు చేసిన ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
అన్వేష్ విదేశాల్లో ఉంటూ వీడియోలు చేస్తున్న నేపథ్యంలో, అతడిని స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే అతడి సోషల్ మీడియా కార్యకలాపాలను అడ్డుకోవాలని పోలీసులు నిర్ణయించారు. అన్వేష్‌కు చెందిన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను పూర్తిగా బ్లాక్ చేయాలని కోరుతూ ఆయా సంస్థలకు పంజాగుట్ట పోలీసులు అధికారికంగా లేఖలు రాయనున్నారు. ఇప్పటికే అతడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌పై నెటిజన్లలో పలు చర్చలు జరుగుతుండగా, పోలీసుల చర్యతో అతడి డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్ అన్నీ మూతపడే అవకాశం ఉంది.
నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో, అన్వేష్ హద్దులు దాటి హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇది హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని, అందుకే అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తనంతట తానుగా డీయాక్టివేట్ అయిందని చెబుతున్నప్పటికీ, పోలీసులు మాత్రం చట్టపరంగా అతడి అన్ని ఛానళ్లను నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు.