అమెరికాలో హనుమాన్ విగ్రహంపై ‘మాగా’ నేత విద్వేషం: ‘ఏలియన్స్ దురాక్రమణ’ అంటూ వ్యాఖ్యలు

టెక్సాస్‌ రాష్ట్రం హ్యూస్టన్ సమీపంలోని షుగర్ ల్యాండ్ వద్ద ఉన్న ‘అష్టలక్ష్మి ఆలయం’లో ఏర్పాటు చేసిన 90 అడుగుల హనుమంతుడి విగ్రహంపై రిపబ్లికన్ నేత కార్లోస్ టర్కియోస్ విషం కక్కారు. మాగా (MAGA) ఉద్యమకారుడైన ఆయన, భారతీయులను మూడో ప్రపంచానికి చెందిన “ఏలియన్స్” తో పోల్చారు. ఈ ఏలియన్స్ టెక్సాస్‌ను ఆక్రమించుకుంటున్నారని, అమెరికన్లు ఈ దురాక్రమణను అడ్డుకోవాలని సోషల్ మీడియా వేదికగా విద్వేషాన్ని చిమ్మారు. అగ్రరాజ్యంలో అత్యంత ఎత్తైన విగ్రహాలలో ఒకటైన దీనిని 2024లో ‘స్టాచ్యూ ఆఫ్ యూనియన్’గా ఆవిష్కరించారు.

టర్కియోస్ తన పోస్ట్‌లో ఇది ఇండియాలోని న్యూఢిల్లీనో లేదా పాకిస్థాన్‌లోని ఇస్లామాబాదో కాదని, ఇది టెక్సాస్ అని పేర్కొంటూ విదేశీయుల పట్ల తనకున్న వ్యతిరేకతను బయటపెట్టారు. ఈ విగ్రహం భక్తికి, బలానికి చిహ్నంగా ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుంటే, ఆయన దీనిని ఒక దురాక్రమణగా చిత్రీకరించడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అమెరికా సమాజ అభివృద్ధిలో వలసదారులు, ముఖ్యంగా భారతీయ అమెరికన్లు పోషిస్తున్న పాత్రను గుర్తు చేస్తూ ఆయనకు సోషల్ మీడియాలో చురకలు అంటిస్తున్నారు.

ఈ విద్వేషపూరిత వ్యాఖ్యలపై నెటిజన్లు దిమ్మతిరిగే కౌంటర్లు ఇస్తున్నారు. అమెరికాలో స్పానిష్ మాట్లాడే వారి కంటే భారతీయ భాషలు మాట్లాడే వారి సంఖ్య తక్కువగా ఉన్నా, భారతీయ అమెరికన్లు దేశానికి ఎంతో మేలు చేస్తున్నారని కొందరు గుర్తు చేశారు. గతంలో కూడా అలెగ్జాండర్ డంకన్ అనే మరో నేత ఈ విగ్రహాన్ని ‘కల్పిత హిందూ దేవుడు’ అంటూ విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఇలాంటి జాత్యహంకార వ్యాఖ్యల వల్ల అమెరికా ప్రతిష్టకే భంగం వాటిల్లుతుందని, హిందువుల వల్ల పాశ్చాత్య నాగరికతకు ఎలాంటి ముప్పు లేదని మేధావులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *