ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంత్రి నారా లోకేష్‌పై ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల కొలంబోలో జరిగిన భారత్-పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను చూడటానికి లోకేష్ ప్రత్యేక విమానంలో శ్రీలంక వెళ్లడాన్ని జగన్ తప్పుబట్టారు. “మనం అందరం క్రికెట్ అభిమానులమే.. కానీ టీవీలో చూస్తే మ్యాచ్ కనిపించదా? ప్రత్యేకంగా కొలంబోనే వెళ్లాలా?” అంటూ జగన్ ఎద్దేవా చేశారు. సామాన్య ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే పాలకులు ఇలా గాల్లో తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
రాష్ట్ర ఆదాయం తగ్గిపోతుంటే, కూటమి నేతలు మాత్రం విలాసవంతమైన ప్రయాణాలకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని జగన్ ఆరోపించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లకు వేర్వేరుగా విమానాలు, హెలికాప్టర్లు ఉన్నాయని.. ఉదయం ఒకచోట, సాయంత్రం మరోచోట ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని విమర్శించారు. తాము కూడా క్రికెట్ అభిమానులమేనని, కానీ ఇంట్లో కూర్చుని టీవీలోనే మ్యాచ్ చూశానని, లోకేష్ లాగా విదేశాలకు వెళ్లలేదని జగన్ పేర్కొన్నారు.
అయితే, జగన్ విమర్శలకు నారా లోకేష్ కూడా సోషల్ మీడియా వేదికగా ధీటుగా బదులిచ్చారు. “ఫ్లైట్ టికెట్టూ నాదే.. మ్యాచ్ టికెట్టూ నాదే.. నా సొంత డబ్బులతో నేను మ్యాచ్ చూస్తే నీకేంటి బాధ జగన్?” అంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు నేతల మధ్య సోషల్ మీడియాలో ‘దుడ్లు’ (డబ్బులు) అంశంపై జరిగిన వార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.