న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు’లో చైనా రోబో డాగ్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన గల్గోటియాస్ యూనివర్సిటీ, తాము స్వయంగా అభివృద్ధి చేశామని చెప్పుకుంటూ ఒక రోబో డాగ్‌ను ప్రదర్శనకు ఉంచింది. అయితే, అది చైనాకు చెందిన ‘యూనిట్రీ’ కంపెనీ తయారు చేసిన రోబో అని సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వైరల్ కావడంతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. తక్షణమే ఆ యూనివర్సిటీ స్టాల్‌ను సదస్సు నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.
గల్గోటియాస్ యూనివర్సిటీ ఈ రోబోకు ‘ఓరియన్’ (Orion) అని పేరు పెట్టి, తమ విద్యార్థుల ఆవిష్కరణగా ప్రచారం చేసుకుంది. కానీ, నిశితంగా పరిశీలించిన నెటిజన్లు ఇది చైనా మార్కెట్లో లభించే ‘యూనిట్రీ Go2’ మోడల్ అని గుర్తించారు. దీని ధర సుమారు రూ. 2-3 లక్షలు ఉంటుందని, ఆన్లైన్లో ఎవరైనా కొనుగోలు చేయవచ్చని ఆధారాలను బయటపెట్టారు. స్వదేశీ పరిజ్ఞానాన్ని ప్రోత్సహించే ఇటువంటి అంతర్జాతీయ వేదికపై చైనా సాంకేతికతను తమదిగా చెప్పుకోవడంపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.
ఈ వివాదంపై గల్గోటియాస్ యూనివర్సిటీ వివరణ ఇస్తూ.. ఆ రోబోను చైనా నుంచే కొనుగోలు చేశామని, విద్యార్థులు ప్రయోగాత్మకంగా నేర్చుకోవడానికి ‘లెర్నింగ్ టూల్’గా వాడుతున్నామని పేర్కొంది. తామే దానిని తయారు చేశామని ఎప్పుడూ చెప్పలేదని బుకాయించే ప్రయత్నం చేసినప్పటికీ, వైరల్ అయిన వీడియోల్లో యూనివర్సిటీ ప్రతినిధులు దీనిని తమ ఆవిష్కరణగా చెబుతున్నట్లు స్పష్టంగా ఉండటంతో కేంద్రం సీరియస్ అయ్యింది. మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను సదస్సు నుంచి వారిని వెళ్లగొట్టి, స్టాల్‌ను ఖాళీ చేయించారు.