తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 24 ఏళ్ల గడ్డం అనన్య సరికొత్త చరిత్ర సృష్టించారు. వికారాబాద్ మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఆమె, రాష్ట్రంలోనే ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డుల్లోకెక్కారు. అనన్య తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె. వికారాబాద్‌లోని 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా 1,138 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన ఆమె, సోమవారం జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా మున్సిపల్ ఛైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు.
లయోలా అకాడమీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తి చేసిన అనన్య, రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నారు. తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూనే, స్వతంత్రంగా ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నివసిస్తున్నప్పటికీ, వికారాబాద్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తండ్రి చాటు బిడ్డగా కాకుండా, సమర్థవంతమైన నాయకురాలిగా ఎదగడమే తన ప్రణాళిక అని వెల్లడించారు.
పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం అనన్య మాట్లాడుతూ.. పట్టణంలోని ప్రాథమిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. గత పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యలపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, వాటన్నింటినీ పరిష్కరించేందుకు కొంత సమయం పడుతుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు ఏళ్లు మాత్రమే అయిందని, ఒక్కొక్కటిగా ప్రజల సమస్యలను తీరుస్తూ వికారాబాద్‌ను మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.