వైజాగ్ షిఫ్టింగ్ పై హైకోర్టుకు జగన్ సర్కార్ క్లారిటీ..

ఏపీలో ప్రస్తుత రాజధాని అమరావతి నుంచి కాబోయే రాజధాని విశాఖకు ప్రభుత్వ కార్యాలయాలను తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై ఇవాళ రెండో రోజు విచారణ జరిగింది. ఇందులో ప్రభుత్వం తమ వాదనను అఫిడవిట్ రూపంలో సమర్పించింది. అనంతరం దీనిపై వాదనలు సాగాయి. చివరికి ఈ వాజ్యాన్ని కూడా త్రిసభ్య ధర్మాసనానికి పంపాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది.

 

విశాఖకు కార్యాలయాల తరలింపుపై నిన్న జరిగిన విచారణలో హైకోర్టు.. ఆఫీసులు ఇప్పటికిప్పుడు తరలిస్తున్నారా లేక ఎప్పుడు తరలిస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే ప్రభుత్వ న్యాయవాది నుంచి సమాధానం లేకపోవడంతో ఇవాళ పూర్తి వివరాలతో రావాలని కోరుతూ విచారణ వాయిదా వేశారు. దీంతో ఇవాళ మరోసారి ఇదే అంశం చర్చకు వచ్చింది. దీంతో ప్రభుత్వం ప్రస్తుతానికి కార్యాలయాలను తరలించడం లేదంటూ హైకోర్టుకు క్లారిటీ ఇచ్చింది.

ప్రభుత్వం హైకోర్టుకు చెబుతున్న దానికి భిన్నంగా వైజాగ్ కు ఆఫీసుల తరలింపు జరుగుతోందంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పదే పదే పస్తావించడంతో హైకోర్టు దీనిపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ప్రభుత్వం.. ప్రస్తుతానికి ఆఫీసులు తరలించడం లేదని, దీనిపై జరుగుతున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని స్పష్టం చేసింది. దీంతో వైజాగ్ కు ఆఫీసుల తరలింపుపై స్పష్టత వచ్చినట్లయింది.

 

మరోవైపు సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన పిటిషన్ త్రిసభ్య ధర్మాసనం ముందు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో వైజాగ్ కు ఆఫీసుల తరలింపు పిటిషన్ కూడా అక్కడికే బదిలీ చేయాలని ప్రభుత్వం కోరుతోంది. ఇదే అంశాన్ని రిజిస్ట్రీలో దరఖాస్తు కూడా చేసింది. ఈ విషయాన్ని ఇవాళ న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ముందు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ కేసుపై విచారణ వాయిదా కోరారు. దీంతో హైకోర్టు 18కి వాయిదా వేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *