మరిన్ని మార్పులు తప్పవ్: మంత్రులకు జగన్ దిశానిర్దేశం: 15న కీలక భేటీ

ఈ నెల 15వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. దీనికి- ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత వహిస్తారు. ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్‌‌లో ఈ భేటీ షెడ్యూల్ అయింది. పలు కీలక అంశాలు, తీర్మానాలు, చర్చకు రానున్నాయి.

 

రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపైనా మంత్రివర్గంలో చర్చకు రానుంది. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలు, ఇతర తీర్మానాలను ఈ నెల 13వ తేదీ సాయంత్రం నాటికి తమకు అందజేయాలంటూ ఇదివరకే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు.

 

నిజానికి ఈ సమావేశం ఈ నెల 14వ తేదీన నిర్వహించాలని తొలుత నిర్ణయించారు. దీన్ని ఒకరోజు వెనక్కి జరిపారు. 15వ తేదీన షెడ్యూల్ చేశారు. పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి, సంక్షేమ పథకాల అమలు తీరు వంటి అంశాలను మంత్రివర్గం చర్చించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర అంశం కూడా మంత్రివర్గంలో చర్చకు రానుంది. రాజకీయంగా అట్టడుగు వర్గాలవారికి తమ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యతను.. మూడు ప్రాంతాల్లో చేపట్టిన ఈ బస్సు యాత్ర ద్వారా ప్రజలకు చేరువ చేయగలిగినట్లు భావిస్తోంది వైసీపీ.

 

ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా అనంతరం తలెత్తిన పరిణామాలు కూడా మంత్రివర్గంలో చర్చకు వచ్చే అవకాశం లేకపోలేదు. 175 నియోజకవర్గాలను గెలిచి తీరాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో- మంత్రులకు కీలక ఆదేశాలను జారీ చేయనున్నారు వైఎస్ జగన్. జనంలో మమేకం అయ్యేలా సామాజిక సాధికార బస్సు యాత్ర వంటి కార్యక్రమాలు మరిన్ని తెరమీదికి తీసుకుని రావొచ్చు.

 

మున్ముందు మరిన్ని మార్పులు ఉండొచ్చనే విషయాన్ని స్పష్టంగా తేల్చేయనున్నారు జగన్. పనితీరు సరిగ్గా లేని శాసన సభ్యులే కాదు.. మంత్రలకు కూడా టికెట్లు దక్కబోదనే సందేశం ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ముగ్గురు మంత్రులు ఆదిమూలపు సురేష్, విడదల రజిని, మేరుగ నాగార్జున నియోజకవర్గాలను సైతం మార్చిన విషయం తెలిసిందే. ఆదిమూలపు సురేష్- కొండెపి, విడదల రజిని- గుంటూరు వెస్ట్, మేరుగ నాగార్జున- సంతనూతలపాడుకు షిఫ్ట్ చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *