తేది:14-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు నిర్వహించనున్న ఎడుపాయల వనదుర్గ మాత జాతరకు మెదక్ జిల్లా పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. జాతర ప్రాంగణమంతా సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఫుట్ పెట్రోలింగ్, మఫ్టీ పోలీసుల గస్తీ కొనసాగించనున్నారు. మహిళా భక్తుల భద్రత కోసం షీ టీమ్స్, మహిళా పోలీసు సిబ్బందిని విస్తృతంగా మోహరించారు.
భక్తులు క్యూలైన్లు తప్పనిసరిగా పాటించాలని, సూచించిన ప్రదేశాల్లోనే వాహనాలను పార్క్ చేయాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వస్తువులు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు.
జాతరను శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ D. V. శ్రీనివాస రావు కోరారు.