గత కొన్ని రోజులుగా మృణాల్ ఠాకూర్ మరియు ధనుష్ ఫిబ్రవరి 14న (ప్రేమికుల రోజున) వివాహం చేసుకోబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై ఒక ఇంటర్వ్యూలో మృణాల్ స్పందిస్తూ.. ఈ వార్తలు విన్నప్పుడు తనకు నవ్వు వచ్చిందని, ఆ రోజు తనకు “ఏప్రిల్ ఫూల్స్ డే” లాంటిదని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “ఈ రోజు నా హల్దీ, రేపు నా సంగీత్.. అందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళండి” అంటూ తనపై వస్తున్న రూమర్స్‌ను హాస్యాస్పదంగా కొట్టిపారేశారు. తన పెళ్లి గురించి తనకే తెలియదని, ఎవరో ఊహించి రాస్తున్న వార్తలు చూస్తుంటే భయమేస్తోందని ఆమె పేర్కొన్నారు.
అయితే, పెళ్లి అనేది తన జీవితంలో ఖచ్చితంగా భాగమని, కానీ దానికి సరైన సమయం, సరైన వ్యక్తి దొరకాలని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం వయసు పెరిగిపోతోందనో లేదా ఇతరుల ఒత్తిడి వల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోనని స్పష్టం చేశారు. “ఎదుటి వ్యక్తితో మౌనంగా ఉన్నా మనకు అసౌకర్యంగా అనిపించని స్థాయి బంధం ఏర్పడినప్పుడు, ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను” అని పెళ్లిపై తనకున్న పరిణతిని చాటుకున్నారు. ఒకవేళ తన జీవితంలో అలాంటి వ్యక్తి దొరికితే, ఆ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేస్తానని ఆమె ప్రామిస్ చేశారు.
ప్రస్తుతం మృణాల్ తన కెరీర్‌పై పూర్తి దృష్టి సారించారు. సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి నటించిన ‘దో దీవానే షెహర్ మే’ చిత్రం ఫిబ్రవరి 20, 2026న విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో అడివి శేష్‌తో కలిసి నటించిన ‘డెకాయిట్’ (Dacoit) చిత్రం కూడా ఏప్రిల్ నెలలో ప్రేక్షకులను అలరించనుంది. వీటితో పాటు ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘పూజా మేరీ జాన్’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు.