“మేము అనుకున్నన్ని రాలేదు.. కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే”: మున్సిపల్ ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర విశ్లేషణ!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని తాము అంచనా వేశామని, అయితే తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని ఆయన అంగీకరించారు. అధికార దుర్వినియోగం, మద్యం, డబ్బు ప్రవాహం మధ్య కూడా బీఆర్ఎస్ 750కి పైగా వార్డుల్లో విజయం సాధించడం ఆశాజనకమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, అందుకే వారికి కూడా ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదని ఆయన విమర్శించారు

హంగ్ ఏర్పడిన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్లలో చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా నిజామాబాద్, కొత్తగూడెం వంటి చోట్ల హంగ్ ఫలితాలు రావడంపై స్పందిస్తూ.. ఆయా ప్రాంతాల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చైర్మన్ ఎన్నికల్లో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చించామని తెలిపారు. తమ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్న ప్రతి చోటా అధికారాన్ని దక్కించుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తామన్నారు.

ఇదే సమయంలో బీజేపీ మరియు కాంగ్రెస్‌లపై కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని, అందుకే కేవలం సగం స్థానాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఇక బీజేపీ ప్రభావం కరీంనగర్, నిజామాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కనిపించలేదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలను అడ్డుకునే ఏకైక శక్తి బీఆర్ఎస్ మాత్రమేనని ఆయన పునరుద్ఘాటించారు. కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్, బీజేపీలను నిరోధించేందుకు సీపీఐకి బేషరతు మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన ఒక కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *