తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ఫలితం వడ్డేపల్లి మున్సిపాలిటీ నుంచి వెలువడింది. మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి నాయకులు ఇక్కడ అద్భుత విజయాన్ని నమోదు చేశారు. వీరంతా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ (AIFB) పార్టీ తరఫున ‘సింహం’ గుర్తుపై ఎన్నికల బరిలోకి దిగి, మున్సిపాలిటీని తమ ఖాతాలో వేసుకున్నారు. కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రకటించకముందే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ద్వారా కవిత తన రాజకీయ సత్తాను మరోసారి చాటుకున్నారు.
వడ్డేపల్లి మున్సిపాలిటీలో మొత్తం 10 వార్డులు ఉండగా, తెలంగాణ జాగృతి నాయకులు ఏకంగా 8 స్థానాల్లో ఘనవిజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా హవా చూపిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ఇక్కడ కేవలం చెరో ఒక్క వార్డుకే పరిమితం కావడం గమనార్హం. 80 శాతం వార్డులను గెలుచుకోవడంతో వడ్డేపల్లి మున్సిపల్ పీఠంపై ఏఐఎఫ్బీ జెండా ఎగరడం ఖాయమైంది. ఈ విజయం జాగృతి శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
రాష్ట్రవ్యాప్త ఫలితాల ట్రెండ్‌ను పరిశీలిస్తే, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మున్సిపాలిటీలను కైవసం చేసుకుని తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం కాంగ్రెస్ 44 చోట్ల, బీఆర్ఎస్ 10 చోట్ల విజయం సాధించాయి. వార్డుల పరంగా కాంగ్రెస్ అభ్యర్థులు 884 చోట్ల, బీఆర్ఎస్ 464 చోట్ల, బీజేపీ 136 చోట్ల గెలుపొందారు. ఈ భారీ పోటీలోనూ ఒక స్వతంత్ర పంథాలో మున్సిపాలిటీని గెలుచుకోవడం ద్వారా కల్వకుంట్ల కవిత వర్గం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.