తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో అత్యంత ఆసక్తికరమైన ఫలితం వెలువడింది. ఇక్కడి మూడో వార్డులో పోటీ చేసిన కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరు అభ్యర్థులకు సమానంగా 357 ఓట్లు పోలయ్యాయి. ఒకే వార్డులో ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు రావడం, అది కూడా రీకౌంటింగ్ నిర్వహించిన తర్వాత కూడా అదే ఫలితం రావడంతో అధికారులు సైతం విస్మయానికి గురయ్యారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం, ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వచ్చినప్పుడు విజేతను లక్కీ డ్రా (చిట్టీల ద్వారా) ఎంపిక చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం, అధికారులు ఇద్దరు అభ్యర్థుల పేర్లను చిన్న కాగితం ముక్కలపై రాసి ఒక బాక్సులో వేశారు. అనంతరం నిర్వహించిన లక్కీ డ్రాలో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు రావడంతో, అధికారులు ఆయనను విజేతగా ప్రకటించారు. దీంతో కేవలం అదృష్టం కలిసొచ్చి బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
దుబ్బాకలో ఇలాంటి ఉత్కంఠ నెలకొనగా, రాష్ట్రవ్యాప్తంగా మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతను కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడైన 45 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ 37 చోట్ల జయకేతనం ఎగురవేయగా, బీఆర్ఎస్ 7 చోట్ల, ఏఐఎఫ్‌బీ ఒక చోట విజయం సాధించాయి. నల్గొండ కార్పొరేషన్‌లో కాంగ్రెస్ లీడ్‌లో ఉండగా, కరీంనగర్‌లో బీజేపీ గట్టి పోటీనిస్తోంది. సాయంత్రానికి పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.