భారత జాతీయ గేయమైన ‘వందేమాతరం’ పూర్తి గీతాన్ని ఆలపించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి విజయసాయిరెడ్డి పూర్తి మద్దతు ప్రకటించారు. సోషల్ మీడియా వేదికగా పూర్తి గీతాన్ని పంచుకున్న ఆయన, ఇప్పటివరకు మనం సగం గేయమే పాడటం బానిసత్వానికి నిదర్శనమని సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ పాలకులు వెళ్లినా, విదేశీ మతాలు మన సంస్కృతిపై ఇంకా ప్రభావం చూపిస్తున్నాయని, ఈ దుస్థితిని మార్చాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు.
గత 120 ఏళ్లుగా విదేశీ మతాల వారు ఏమనుకుంటారోనన్న భయంతోనే పూర్తి గేయాన్ని పాడలేకపోయామా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. మన జాతీయ గేయంలో మన సంస్కృతిని ప్రతిబింబించే అమ్మవార్ల పేర్లు ఉండకూడదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో పుట్టిన మనకు, మన అస్తిత్వాన్ని చాటుకునే మనసు ఉండదా అని నిలదీస్తూ.. విదేశీ మతాల కోసం మన భారతీయ సంస్కృతిని వదులుకోవద్దని దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆయన కోరారు. బానిసత్వపు భావజాలం నుంచి బయటకు వచ్చి, భారతీయ ఆత్మను ప్రతిబింబించేలా పూర్తి ‘వందేమాతరం’ గీతాన్ని గర్వంగా ఆలపించాలని సూచించారు. దేశ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ విషయంలో వెనకడుగు వేయకూడదని ఆయన స్పష్టం చేశారు.