‘బరాబర్ ప్రేమిస్తా’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ పాడిన ‘గుంజి గుంజి’ పాటలో కొన్ని పదాలను మార్చి, బూతులతో పాడటం పెద్ద వివాదానికి దారితీసింది. ఈ అంశంపై జేడీ చక్రవర్తి స్పందిస్తూ.. సినిమా పబ్లిసిటీ కోసం ఇంత దిగజారిపోకూడదని హితవు పలికారు. అయితే, జేడీ చక్రవర్తి మాట మార్చారని చంద్రహాస్ ఆరోపిస్తున్నారు. స్టేజీ మీద తాను పాట పాడుతున్నప్పుడు నవ్వుతూ, చప్పట్లు కొట్టిన ఆయన, బయటకు వచ్చాక విమర్శలు చేయడం సరికాదని చంద్రహాస్ మండిపడ్డారు. ముందు ఒకలా, వెనుక ఒకలా ఉండటం ఆయన స్థాయికి తగదని వ్యాఖ్యానించారు.
జేడీ చక్రవర్తి తన తండ్రి (నటుడు ప్రభాస్)కి పంపిన మెసేజ్‌లు తన దగ్గర ఆధారాలుగా ఉన్నాయని చంద్రహాస్ వెల్లడించారు. “మనోడికి మైలేజ్ వస్తుంది.. నేను మాట్లాడటం వల్ల ఇంకా వైరల్ అవుతాడు” అని జేడీ మెసేజ్ చేశారని, ఇంటర్వ్యూలో తాను హార్ష్‌గా మాట్లాడతానని ముందే చెప్పారని ఆయన పేర్కొన్నారు. తప్పు ఉంటే అక్కడికక్కడే కొట్టినా పడేవాడినని, కానీ ఇలా రెండు నాల్కల ధోరణి ప్రదర్శించడం వల్ల ఆయన్ని గెస్టుగా పిలిచినందుకు ఇప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నానని చంద్రహాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా పోలీస్ స్టేషన్ వరకు చేరింది. చంద్రహాస్ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఒక జర్నలిస్టును ఆయన బెదిరించారనే ఆరోపణతో మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోవైపు, సోషల్ మీడియాలో నెటిజన్లు చంద్రహాస్ తీరును విమర్శిస్తుండగా, ఆయన మాత్రం తాను చేసిన దాంట్లో తప్పేమీ లేదని, ట్రోలర్స్ తనను తిట్టిన పదాలనే తాను వాడానని సమర్థించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది.