మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై జరిగిన దాడిని ఖండించేందుకు జగన్ ఇబ్రహీంపట్నం వెళ్తున్న క్రమంలో బైక్ స్టంట్స్ చేస్తూ ఒక యువకుడు మృతి చెందాడు. మృతుడిని ఇబ్రహీంపట్నం కొత్తగేటుకు చెందిన భార్గవ్ గా గుర్తించారు. జగన్ ర్యాలీలో ఉత్సాహంగా బైక్ విన్యాసాలు చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో ఈ ఘోరం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
మరో ఘటనలో, జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దొంగల రాంబాబు (45) తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచారు. జగన్ ను చూసేందుకు జోగి రమేశ్ ఇంటి వద్దకు భారీగా తరలివచ్చిన జనసందోహంలో ఆయన ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయారు. తోపులాటలో పడిపోయిన ఆయనను తోటి కార్యకర్తలు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా ఆంక్షలు విధించారు. జగన్ కాన్వాయ్ వెళ్లిన తర్వాత అభిమానులను మరియు ఇతర నేతలను పోలీసులు అనుమతించకపోవడంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య పలుచోట్ల వాగ్వాదం జరిగింది. ఈ ఆంక్షల నడుమ కూడా భారీగా జనం తరలిరావడం మరియు బైక్ ర్యాలీలు నిర్వహించడం వల్ల ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.