ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. వై నాట్ 175 అంటూ సీఎం జగన్ అధికారం నిలబెట్టుకోవటం పైన కసరత్తు చేస్తున్నారు. టీడీపీ – జనసేన పొత్తుతో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బీజేపీ ఈ రెండు పార్టీలతో కలిసి వస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. ఈ సమయంలోనే టీడీపీలో సీట్ల కోసం అభ్యర్దుల ఒత్తిడి పెరుగుతోంది. టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తనకు సీటు ఖరారు పైన తాజాగా అల్టిమేటం జారీ చేయటం సంచలనంగా మారుతోంది.
తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేసారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సీటు తనకు ఇస్తారని నమ్మకం ఉందని వ్యాఖ్యానించారు. బీసీ వర్గానికి చెందిన తనకు ఇస్తారని ఆశిస్తున్నానని.. ఇవ్వకపోతే ఆప్షన్ బీ సిద్దంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికలతో..అక్కడి రాజకీయంతో టీడీపీకి సంబంధం లేదని చెప్పారు. గాంధీ భవన్ లో టీడీపీ జెండాలు ఎగిరితే చంద్రబాబుకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఎవరైనా చంద్రబాబును విమర్శిస్తే తాము జగన్ ను విమర్శిస్తామని హెచ్చరించారు. వైసీపీ నేతలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సీఎం జగన్ దేనని బుద్దా వెంకన్న స్పష్టం చేసారు.
విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేస్తానని బుద్దా వెంకన్న తేల్చి చెప్పారు. చంద్రబాబు పైన ఈగ కూడా వాలకుండా చూస్తామన్నారు. ఇదే సమయంలో తనకు సీటు ఇవ్వకపోతే ఆప్షన్ బీ సిద్దంగా ఉందంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇప్పుడు టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా విజయవాడ నగరంలోని మూడు సీట్లలో ఒకటి జనసేనకు కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది. విజయవాడ పశ్చిమం నుంచి జనసేన నేత పోతిన మహేష్ రేసులో ఉన్నారు. వంగవీటి రాధా జనసేనలో చేరి సెంట్రల్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. అదే విధంగా బోండా ఉమా మరోసారి సెంట్రల్ నుంచి పోటీకి సిద్దం అవుతున్నారు. ఈ సమయంలో పశ్చిమం సీటు పైన బుద్దా వెంకన్న కామెంట్స్ చేసారు. దీని పైన ఇప్పుడు టీడీపీ నాయకత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి