న్యాయం మూసిన తలుపుల వెనుక రోదిస్తోంది: సుప్రీంకోర్టులో స్వయంగా వాదించిన మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం సుప్రీంకోర్టులో స్వయంగా లాయర్ అవతారమెత్తి అందరినీ ఆశ్చర్యపరిచారు. రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భారీ అక్రమాలు జరిగాయని, ఏకంగా 58 లక్షల మంది ఓటర్లను తొలగించారని ఆమె సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఛాంబర్‌లో తన వాదనలు వినిపిస్తూ.. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) ఆరుసార్లు లేఖలు రాసినా కనీస స్పందన లేదని, అందుకే స్వయంగా కోర్టుకు రావాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

“సార్.. మాకు ఎక్కడా న్యాయం జరగడం లేదు, న్యాయం మూసిన తలుపుల వెనుక రోదిస్తోంది” అంటూ మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు కోర్టు హాల్‌లో చర్చనీయాంశమయ్యాయి. బెంగాల్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఓటర్ల తొలగింపు అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రమైన అసోంలో ఇటువంటి సవరణలు చేపట్టకుండా, కేవలం బెంగాల్‌నే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ఆమె ప్రశ్నించారు. ఈసీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ముఖ్యమంత్రి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని హామీ ఇచ్చింది. మమతా బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. రెండు రోజుల క్రితమే ఢిల్లీలో ఎన్నికల కమిషనర్లతో జరిగిన భేటీ నుంచి ఆమె అర్ధాంతరంగా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. లక్షలాది మంది బాధితులను ఢిల్లీకి తీసుకొస్తానని ఈ సందర్భంగా ఆమె ఎన్నికల సంఘాన్ని హెచ్చరించారు. ఈ పరిణామం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *