పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం లోక్‌సభలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్షానికి చెందిన ఎనిమిది మంది ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్ష మహిళా ఎంపీలు ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీటును చుట్టుముట్టారు. వర్షా గైక్వాడ్, జ్యోతిమణి వంటి ఎంపీలు ‘డూ వాట్ ఈజ్ రైట్’ అనే నినాదంతో కూడిన భారీ బ్యానర్‌ను ప్రధాని ప్రసంగించాల్సిన సమయంలో ప్రదర్శించారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొనగా, ప్యానెల్ స్పీకర్ సంధ్య రాయ్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
ఈ వివాదానికి మూలం మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే ఆత్మకథలోని అంశాలపై చర్చకు అనుమతి నిరాకరించడం. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేయగా, అందుకు స్పీకర్ నిరాకరించారు. ఈ క్రమంలో మంగళవారం ఎనిమిది మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం మంటలకు ఆజ్యం పోసింది. బుధవారం సాయంత్రం ప్రధాని మోదీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడాల్సి ఉండగా, ఈ నిరసనల కారణంగా ఆయన ప్రసంగం రద్దయింది. సభలో పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరియు ఇతర మంత్రులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.
ఈ ఘటనపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఎంపీలు పక్కా ప్రణాళికతోనే ప్రధానిపై దాడి చేసేలా సీటును చుట్టుముట్టారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. మరోవైపు, తమ సభ్యులపై అప్రజాస్వామికంగా సస్పెన్షన్ వేటు వేశారని కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ వెలుపల కూడా ధర్నా నిర్వహించారు. సభ పదేపదే వాయిదా పడటంతో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ పూర్తికాకుండానే లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది.