ఇదివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెలంగాణ ప్రభుత్వం డిస్కమ్‌లకు 80,000 కోట్ల రూపాయలకు పైగా అప్పులు ఉన్నట్లు వస్తోన్న వార్తలపై భారత్ రాష్ట్ర సమితి స్పందించింది. దీనిపై విద్యుత్ ప్రగతి పేరుతో ఓ ప్రకటనను విడుదల చేసింది. రాష్ట్రం ఏర్పాటైన 2014 జూన్ 2 నుంచి ఈ ఏడాది మే 1వ తేదీ వరకు విద్యుత్ రంగంలో నమోదైన పురోగతిని ఇందులో పొందుపరిచింది.
డిస్కమ్‌లకు తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పులు మొత్తం 81,516 కోట్ల రూపాయలు ఉన్నాయని అవన్నీ కూడా కేసీఆర్ హయాంలో నమోదైనవి కావని తెలిపింది. ఇందులో తెలంగాణ వాట కింద సంక్రమించిన ఉమ్మడి రాష్ట్రం అప్పులు 22,423 కోట్ల రూపాయలుగా నిర్ధారించింది.
పదేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఇచ్చిన సబ్సిడీ మొత్తం 42,000 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు వివరించింది. 800 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యం గల కొత్తగూడెం విద్యుత్ కేంద్రం ఎనిమిదో స్టేజీ, 600 మెగావాట్ల భూపాలపల్లి కాకతీయ పవర్ ప్లాంట్ రెండో దశ, 1,080 మెగావాట్ల మణుగూరు భద్రాద్రి పవర్ ప్లాంట్, సింగరేణి రెండో దశ, 240 మెగావాట్ల దిగువ జూరాల హైడల్ ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిందని తెలిపింది.
26,000 కోట్ల రూపాయల వ్యయంతో 4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం దాదాపు పూర్తయిందని, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటికి, పరిశ్రమలకు నిరంతర నాణ్యమైన విద్యుత్ అందించడానికి విద్యుత్ సరఫరా- పంపిణీ వ్యవస్థను గత ప్రభుత్వం బలోపేతం చేసిందని తెలిపింది.
400 కేవీ సబ్ స్టేషన్లను ఆరు నుంచి 25, 220 కేవీ సబ్ స్టేషన్లు 51 నుంచి 103కు, 132 కేవీ సబ్ స్టేషన్లు 176 నుంచి 250కి, 33/11 కేవీ సబ్ స్టేషన్లు 2,138 నుంచి 3,250కి బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచిందని వివరించింది. విద్యుత్ లైన్లు 4.8 లక్షల ఉంటే వాటిని 6.8 లక్షలకు పెంచడం ద్వారా సరఫరా వ్యవస్థను పటిష్టపరిచిందని పేర్కొంది.
2014లో ట్రాన్స్ఫార్మర్ల సంఖ్య 3,200 ఉండగా.. 2023 నాటికి ఈ సంఖ్యను 5,700కు పెంచిందని బీఆర్ఎస్ వివరించింది. 2014లో 4.67 లక్షల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్యను 5,700కు తమ ప్రభుత్వం తీసుకెళ్లిందని స్పష్టం చేసింది.
రాష్ట్రం ఏర్పడే నాటికి 19 లక్షల బోర్లు ఉంటే ప్రస్తుతం 27.5 లక్షల బోర్లకు ఉచిత విద్యుత్‌ను గత ప్రభుత్వం అందించగలిగిందని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 2014 నాటికి 1.11 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉంటే 2023 నాటికి ఈ సంఖ్య 1.78 కోట్లకు పెరిగిందని, వాటన్నింటికీ నాణ్యమైన కరెంట్‌ను సరఫరా చేయగలిగామని తెలిపింది.
తెలంగాణలో గృహాలకు కరెంట్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు, రైతులకు విద్యుత్ కష్టాలు లేవని, దీనికి కారణంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులేనని బీఆర్ఎస్ పేర్కొంది. కేసీఆర్ సాధించిన ఈ విద్యుత్ విజయాలను కప్పిపుచ్చడానికి అప్పుల పేరుతో కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకాలకు తెరలేపిందని విమర్శించింది.