దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల జోరు రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ సెమీ హైస్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రభుత్వం ప్రయాణికులకు మరింత చేరువ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 33 రైళ్లు పట్టాలెక్కాయి. వేర్వేరు రాష్ట్రాలు/నగరాల మధ్య పరుగులు పెడుతున్నాయి.
ఈ రైళ్లల్లో ఇప్పటివరకు లేని కొన్ని ప్రత్యేకతలు ఉండటం వల్ల వాటికి డిమాండ్ పెరుగుతోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. పండగ సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- త్వరతగతిన గమ్యస్థానాలకు చేరడానికి వందే భారత్‌ను ఆశ్రయిస్తోన్నారు ప్రయాణికులు.
Secunderabad-Pune Vande Bharat set inaugurated on Dec 17
ప్రజల నుంచి వీటికి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ- మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది. ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రానుంది. 2024 ఫిబ్రవరి నాటికి ఈ స్లీపర్ వందే భారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెట్టనున్నాయి.
ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకుని రాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ. ఒకే రోజున 10 వందే భారత్ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల మధ్య వాటిని నడిపించడానికి ఏర్పాట్లు పూర్తి చేసింది కూడా. ఇందులో సికింద్రాబాద్ పేరు కూడా ఉంది.
సికింద్రాబాద్- పుణె మార్గంలో కొత్త వందే భారత్ రైలు అందుబాటులోకి రాబోతోంది. వందే భారత్ లేదా వందే సాధారణ్/అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్-పుణె మార్గంలో వందే భారత్ రైళ్లు తిరుగాడట్లేదు. దేశవ్యాప్తంగా అత్యంత రద్దీ మార్గాల్లో ఇదీ ఒకటి కావడం వల్ల వందే భారత్‌ను కేటాయించింది.
సికింద్రాబాద్- పుణెతో పాటు వారణాశి- లక్నో, పాట్నా- జల్‌పాయ్‌గురి, మడ్గావ్- మంగళూరు, ఢిల్లీ- అమృత్‌సర్, ఇండోర్- సూరత్, ముంబై- కొల్హాపూర్, ముంబై- జాల్నా, పుణె- వడోదర, టాటానగర్- వారణాశి మధ్య కొత్త వందే భారత్ రైళ్లు పరుగులు తీయనున్నాయి. వీడియో కాన్ఫరెన్స్ రూపంలో ఢిల్లీ నుంచి ప్రధాని మోదీ ఈ రైళ్లను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు.