ప్రియురాలు అలిగిందని రైలు పట్టాలపై తలపెట్టిన యువకుడు.. టెక్కలిలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం!

వివరాల్లోకి వెళ్తే.. మెళియాపుట్టి మండలానికి చెందిన యువకుడు, పార్వతీపురం ప్రాంతానికి చెందిన యువతి విజయనగరంలో డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆదివారం తన ప్రియురాలిని చూడాలనే కోరికతో ఆ యువకుడు తనకు టెక్కలిలో ప్రమాదం జరిగిందని అబద్ధం చెప్పి ఆమెను పిలిపించాడు. కంగారుగా అక్కడకు చేరుకున్న యువతికి, అది కేవలం తన ప్రేమను పరీక్షించేందుకు ఆడిన నాటకమని తెలియడంతో ఆమె తీవ్రంగా అలిగింది. అతనితో మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది.

తను వెళ్లకుండా అడ్డుకునే క్రమంలో ఆ యువకుడు మరింత సాహసానికి పూనుకున్నాడు. ఆమెను బెదిరించడానికి రైల్వే పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకుంటానని రచ్చ చేశాడు. సరిగ్గా అదే సమయంలో గుణుపూర్ వెళ్లే ప్యాసింజర్ రైలు స్టేషన్‌లోకి వస్తుండటంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పోలీసులు వెంటనే స్పందించి ఆ యువకుడిని పట్టాల మీద నుంచి పక్కకు లాగేయడంతో ఒక పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.

అనంతరం పోలీసులు ఆ ప్రేమికులిద్దరినీ రైల్వే పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులను పిలిపించి, జరిగిన విషయం వివరించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రేమ పేరుతో ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వారికి హితవు పలికారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *