కేసీఆర్‌కు సిట్ నోటీసులు అప్రజాస్వామికం – నల్ల కండువాలతో బీఆర్ఎస్ శ్రేణుల నిరసన ర్యాలీ.

తేది:1-02-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.

మెదక్ జిల్లా : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి సిట్ నోటీసులు జారీ చేయడం పూర్తిగా అప్రజాస్వామిక చర్యగా బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని ఆరోపిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ప్రతిపక్ష నాయకులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఆదివారం మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ ఎన్. పద్మ దేవేందర్ రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి రంగా చౌరస్తా వరకు నల్లని కండువాలు దరించి బైక్ ర్యాలీ నిర్వహిస్తూ నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శ్రీ ఫారక్ హుస్సేన్‌తో పాటు మెదక్ పట్టణానికి చెందిన బీఆర్ఎఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నల్ల కండువాలతో నిరసన తెలుపుతూ ‘కేసీఆర్‌కు న్యాయం చేయాలి’, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది.
బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన కేసీఆర్ గారిపై రాజకీయ కక్షతో అక్రమ కేసులు, నోటీసులు జారీ చేయడం తగదని అన్నారు. ఇలాంటి చర్యలకు ప్రజలు తగిన సమాధానం ఇస్తారని హెచ్చరిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *