కేసీఆర్ కు రేవంత్ సర్కార్ మరో షాక్..

తెలంగాణలో తాజాగా అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వరుసగా సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పిదాల్ని సవరించడంతో పాటు దొరపాలనగా తాము చేసిన ఆరోపణలకు కొనసాగింపుగా ఆయా చర్యల్ని, నిర్ణయాల్ని రద్దు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాళ గతంలో మాజీ సీఎం కేసీఆర్ నియమించిన పలువురు ప్రభుత్వ సలహాదారుల నియామకాల్ని రద్దు చేసింది.

 

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం స్ధానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే భారీ ఎత్తున ప్రభుత్వ సలహాదారులు రాజీనామాలు సమర్పించారు. మరికొందరు ఇంకా ఆ పదవుల్లోనే కొనసాగుతున్నారు. దీంతో ఆయా నియామకాల్ని రద్దు చేస్తూ ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ రద్దయిన నియమకాల్లో సలహాదారులు సోమేష్ కుమార్, చెన్నమనేని రమేష్, రాజీవ్ శర్మ, అనురాగ్ శర్మ, ఏకే ఖాన్, జీఆర్ రెడ్డి, ఆర్ శోభ వంటి వారు ఉన్నారు. ప్రభుత్వం వీరికి గతంలో ఇచ్చిన నియామక ఉత్తర్వుల్ని కాంగ్రెస్ సర్కార్ రద్దు చేసేసింది.

 

వాస్తవంగా ఏ ప్రభుత్వ హయాంలో అయినా నామినేటెడ్ పదవులు ఇచ్చి నియామకాలు చేపట్టినా ఆ తర్వాత సదరు ప్రభుత్వాలు కొనసాగకపోయే వేరే ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయా పదవుల్లో ఉన్న వారు గౌరవంగా రాజీనామాలు చేసి వెళ్లిపోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే కొందరు అధికారులు, నేతలు మాత్రం ఆయా పదవుల్లో కొనసాగితే మాత్రం కొత్త ప్రభుత్వాలు వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తోంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. దీనిపై బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *