తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారిపోయాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమైన సీపీఐ భారీ షాక్ ఇచ్చింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కాంగ్రెస్‌తో పొత్తును తెగదెంపులు చేసుకున్న ఎర్రజెండా పార్టీ, ఖమ్మం జిల్లాలో ఒంటరిగా బరిలోకి దిగింది. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఇలాకాలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
ఖమ్మం జిల్లాలోని కీలక మున్సిపాలిటీల్లో సీపీఐ తన బలాన్ని చాటుకునేందుకు సిద్ధమైంది. కొత్తగూడెం మున్సిపాలిటీలో చెరి సగం సీట్లు కావాలని సీపీఐ డిమాండ్ చేయగా, కాంగ్రెస్ కేవలం 20 వార్డులే ఇచ్చేందుకు మొగ్గు చూపింది. దీంతో ఆగ్రహించిన సీపీఐ, అక్కడ మొత్తం 60 డివిజన్లలో ఒంటరిగా నామినేషన్లు వేసింది. అలాగే భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిరలో 5 చోట్ల, పొంగులేటి ఇలాకాలోని ఏదులాపురంలో 15 వార్డుల్లో సీపీఐ అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇన్నాళ్లు కలిసి నడిచిన మిత్రపక్షాలు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే.. కొన్ని చోట్ల సీపీఐ ఏకంగా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌తో చేతులు కలిపింది. చెన్నూరు నియోజకవర్గంలోని క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో గులాబీ, ఎర్రజెండాలు కలిసి పోటీకి దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని, క్షేత్రస్థాయిలో తమ ఉనికిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందని సీపీఐ నేతలు మండిపడుతున్నారు. ఈ చీలిక మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.