తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కీలక నిర్ణయం తీసుకున్నారు. సిట్ (SIT) విచారణకు హాజరయ్యేందుకు అంగీకరిస్తూనే, పోలీసుల తీరును తప్పుబడుతూ జూబ్లీహిల్స్ ఏసీపీకి 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. తన నివాసం గోడపై నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని, ఇది తన వ్యక్తిగత గౌరవాన్ని కించపరచడమేనని ఆయన లేఖలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం 65 ఏళ్లు దాటిన వ్యక్తులను వారి నివాసంలోనే విచారించాలనే నిబంధనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
నోటీసుల జారీ ప్రక్రియలో పోలీసులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారని కేసీఆర్ ఆరోపించారు. ‘సతేందర్ కుమార్ యాంటిల్ వర్సెస్ సీబీఐ’ వంటి కీలక తీర్పులను ఉటంకిస్తూ, నిందితులు లేదా సాక్షులను వారు నివసిస్తున్న చోటే విచారించాలని స్పష్టం చేశారు. తన శాశ్వత నివాసం ఎర్రవల్లిలో ఉందని, భవిష్యత్తులో నోటీసులన్నీ అక్కడికే పంపాలని పోలీసులకు సూచించారు. పోలీసుల ప్రస్తుత తీరు కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరిస్తూనే, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు.
అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తోసిపుచ్చే అవకాశం ఉన్నప్పటికీ, విచారణకు సహకరించాలన్న ఉద్దేశంతో ఫిబ్రవరి 1వ తేదీ (రేపు) మధ్యాహ్నం 3 గంటలకు తన నందినగర్ నివాసంలో అందుబాటులో ఉంటానని కేసీఆర్ ప్రకటించారు. దీంతో సిట్ అధికారులు రేపు ఆయన ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఒకవైపు చట్టపరమైన పోరాటం చేస్తూనే, మరోవైపు విచారణకు సిద్ధమవ్వడం ద్వారా కేసీఆర్ ఈ కేసులో ఎదురుదాడికి సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.