ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ప్లాట్ల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమస్యాత్మక ప్లాట్లు పొందిన వారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 15న ఈ – లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రైతుల అభ్యర్ధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఆర్ఢీఏ స్పష్టం చేస్తోంది. సీఆర్డీఏ కార్యాలయంలోనే ఈ లాటరీ విధానం లో ప్లాట్లు కేటాయించనున్నారు.
రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందిన రైతులు సీఆర్డీఏ ముందు తమ అభ్యంతరాలు వ్యక్తం చేసారు. గత ప్రభుత్వ హాయంలో భూసమీకరణలో పొలాలిచ్చిన రైతుల్లో కొందరికి భూ సేకరణ (భూసమీకరణ విముఖత చూపిన వారికి) భూముల్లో నివాస..వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. ఆ తరువా ప్రభుత్వం మారడం..రాజధాని నిర్మాణం నిలిచిపోవటంతో భూ సేకరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. దీంతో, తమకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని రైతులను సీఆర్డీఏను కోరారు.
ఇలాంటివి 2,243 ప్లాట్లు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్లాట్లు కలిగి ఉన్న 679 మంది రైతులకు సీఆర్డీఏ రెండు విడతలుగా నోటీసులు పంపింది. రైతులు అంగీకారం తెలిపితే భూసేకరణ భూముల్లో ఉన్న ప్లాట్లను రద్దు చేసి, ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయిస్తామని వాటిలో పేర్కొంది. అయితే 44 మంది రైతులు మాత్రమే ప్రత్యామ్నాయ ప్లాట్లకు అంగీరారం తెలిపినట్లు తెలుస్తోంది. వారికి ఈ నెల 15న విజయవాడలోన సీఆర్డీఏ కార్యాలయంలో ఈ – లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక, రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది. విశాఖ నుంచి పాలన ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వారంలో రెండు రోజులు సీఎంతో పాటుగా మంత్రులు విశాఖలోనే ఉంటూ పాలనా వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఈ నెలలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభం అవుతుందని చెబుతున్నారు. ఇప్పటికే సీఎం క్యాంపు కార్యాలయంతో పాటుగా మంత్రుల కార్యాలయాలు సిద్దం చేసారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న వేళ..విశాఖ నుంచి సీఎం పాలన..అమరావతి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.