తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ఉదంతం మరోసారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ (SIT) నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ఈ నోటీసుల వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. ప్రభుత్వం కావాలనే ఈ అంశాన్ని సాగదీస్తోందని.. విచారణలో చిత్తశుద్ధి లోపించిందని ఆమె విమర్శించారు.
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. సరిగ్గా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటో ప్రజలందరికీ అర్థమవుతోందని అన్నారు. రాజకీయంగా లబ్ధి పొందడానికే ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సీరియస్ అంశమని, కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిపై కేవలం కాలయాపన చేస్తోందే తప్ప, నిజా నిజాలను బయటపెట్టే దిశగా అడుగులు వేయడం లేదని అభిప్రాయపడ్డారు.
‘ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా బాధాకరమైన విషయం. వ్యక్తుల ప్రైవసీకి భంగం కలగడం అనేది ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదు. అయితే, ఈ కేసును త్వరగా కొలిక్కి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విచారణను వేగవంతం చేసి, ఈ కేసును కంక్లూడ్ చేయాలి. కానీ ప్రభుత్వం వైఖరి చూస్తుంటే అసలు వారి ఉద్దేశం ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు’ అని కవిత వ్యాఖ్యానించారు.
కేసు విచారణలో జరుగుతున్న ఆలస్యంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికే ఈ కేసును వాడుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతోందని అన్నారు. చివరగా, చట్టం తన పని తాను చేసుకుపోవాలని, ఒకవేళ నేరం రుజువైతే నేరస్తులు ఖచ్చితంగా పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, అది రాజకీయ కక్షసాధింపు చర్యగా మారకూడదని ఆమె హితవు పలికారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.