కడప జిల్లా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగి హర్షవీణ గత చరిత్రకు సంబంధించిన కొన్ని కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి రావడంతో ఈ కేసు ఉత్కంఠభరితంగా మారింది. మీడియా ముందు తనకు గతంలో పెళ్లి కాలేదని, ఎమ్మెల్యే శ్రీధర్ వల్లే తన ప్రస్తుత భర్త నాగమునిరెడ్డితో విభేదాలు వచ్చాయని చెప్పిన హర్షవీణకు, అంతకంటే ముందే వివాహం జరిగినట్లు తాజాగా ఆధారాలు లభ్యమయ్యాయి. 2018లో విశాఖపట్నంకు చెందిన సంసాని భవాని శంకర్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగినట్లు ఎఫ్ఐఆర్ (FIR) కాపీల ద్వారా స్పష్టమవుతోంది.
వివరాల్లోకి వెళితే, 2018లో బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో హర్షవీణ తన మొదటి భర్త భవాని శంకర్, అతని కుటుంబ సభ్యులపై వేధింపుల కేసు పెట్టినట్లు వెల్లడైంది. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన భవాని శంకర్‌ను ఆమె వివాహం చేసుకున్నారని, అయితే పెళ్లయిన తర్వాత తనను శారీరకంగా, మానసికగా వేధిస్తున్నారంటూ అప్పట్లో ఆమె 498ఏ సెక్షన్ కింద ఫిర్యాదు చేశారు. సుమారు ఐదేళ్ల పాటు ఈ కేసు విచారణ సాగింది. అయితే, 2023 డిసెంబర్ 20న బద్వేల్ కోర్టు ఈ కేసును కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. హర్షవీణ చేసిన ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ ఆమె మాజీ భర్త భవాని శంకర్, అతని సోదరుడు శ్రీరామ్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
నిన్నటి వరకు మీడియా ముందు మాట్లాడుతూ తనకు ఎలాంటి పెళ్లిళ్లు కాలేదని బుకాయించిన హర్షవీణ, ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసే క్రమంలో ఆమె తన వ్యక్తిగత విషయాలను దాచిపెట్టడంపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీ నాయకులు మొదటి నుంచి ఆమె ఆరోపణలను తప్పుబడుతూ, ఆమెపై అనేక పెళ్లిళ్ల ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె నాగమునిరెడ్డితో వివాహం జరిగిందని చెబుతున్నప్పటికీ, అంతకంటే ముందు భవాని శంకర్‌తో జరిగిన పెళ్లి విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారనేది చర్చనీయాంశంగా మారింది.
ఎమ్మెల్యే శ్రీధర్‌ను బద్నాం చేసేందుకే ప్రత్యర్థుల ప్రోద్బలంతో ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే అనుచరులు వాదిస్తున్నారు. మరోవైపు, ఆమె గతంలో పెట్టిన వేధింపుల కేసును కోర్టు కొట్టివేయడం కూడా ఇప్పుడు ఆమె విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కేవలం లైంగిక వేధింపుల కేసుగానే కాకుండా, బాధితురాలిగా చెప్పుకుంటున్న మహిళ గత వివాహాలు, ఆమె చేస్తున్న ఆరోపణల వెనుక ఉన్న నిజానిజాలపై పోలీసు విచారణకు దారితీస్తోంది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనపై వస్తున్నవన్నీ రాజకీయ కుట్రలని చెబుతుండగా, హర్షవీణ మాత్రం న్యాయం కోసం పోరాడుతున్నానని పేర్కొంటున్నారు.