షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ జిల్లాలో అమల్లోకి నూతన విధానం-మెదక్ జిల్లా రవాణాశాఖాధికారి వెంకటస్వామి.

తేది:29-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం.

మెదక్ జిల్లా: నాన్‌ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలు కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఉండదు. కార్లు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసిన వారు ఇకపై షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు. రవాణా శాఖ కొత్తగా ప్రవేశపెట్టిన ఈ విధానం ఈ నెల 24 నుంచి జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చిందని జిల్లా రవాణా శాఖాధికారి వెంకటస్వామి తెలిపారు. గురువారం జిల్లాలో కేంద్రంలోని న్యూ వాసు హీరో మోటార్స్ షోరూంలో వాహనదారులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ (టీఆర్) పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఈ నెల 23 వరకు కొనుగోలు చేసిన వాహనాలకు మాత్రం రవాణా శాఖ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ జరుగుతుందని డీటీఓ తెలిపారు. అలాగే, వాణిజ్య వాహనాలకు సంబంధించి రవాణా శాఖ కార్యాలయానికే రావాలని పేర్కొన్నారు. మిగతా వాహనాల(కార్లు, ద్విచక్రవాహనాలు)కు షోరూం డీలర్లే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారని తెలిపారు. వాహనదారుడు షోరూమ్ లో ఉదయం వాహనాన్ని కొనుగోలు చేస్తే సాయంత్రానికి శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని తెలిపారు. ఒకవేళ సాయంత్రం కొనుగోలు చేస్తే మరుసటి రోజు ప్రక్రియ చేస్తారని పేర్కొన్నారు. ఇందుకోసం అవసరమైన పత్రాల(ఇన్వాయిస్ ఫారం-21, 22,, ఇన్సూరెన్స్, చిరునామా ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్, పాన్ కార్డు వాహనాల ఫొటో)లను డీలర్లే ఆన్లైన్లో అప్లోడ్ చేయనుండగా. రవాణా శాఖ కార్యాలయంలో పరిశీలించి రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయిస్తామని తెలిపారు. ఆపై గతంలో మాదిరిగానే స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి కార్డు చేరుతుందని చెప్పారు. ఈ ప్రక్రియలో వాహనదారులకు సమస్యలు ఎదురైతే ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయం ద్వారా ఉద్యోగులు ఎన్ఫోర్స్మెంట్తోపాటు ఇతర సేవలపై పూర్తిగా దృష్టి సాధించే అవకాశముంటుంటుందని డీటీఓ వెల్లడించారు. ఈ కొత్త విధానంతో వాహనదారులకు రాకపోకలు. రవాణా ఖర్చు.. సమయం వృథా కాకుండా ఉంటుందన్నారు. నిత్యం రవాణా శాఖ కార్యాలయంలో సుమారు 50 రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా, ఇక నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 షోరూమ్ ల్లో జరగనున్నాయి. ఇప్పటికే షోరూం డీలర్లకు ఈ ప్రక్రియ పై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో హీరో మోటార్స్ ప్రొప్రైటర్ బండ నరేందర్, వాహనదారులు, రవాణా శాఖ సిబ్బంది సందీప్ , రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *