ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని… రాష్ట్రం తీరు ప్రస్తుతం జంగిల్ రాజ్ ను తలపిస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. రాష్ట్రంలో విచ్చలవిడితనం పెరిగిపోయిందని, అధికార పార్టీ నేతలు బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఉద్యోగులపై బెదిరింపులు.. పథకాల రద్దు..
రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగిని బహిరంగంగా బెదిరించడమే ఇందుకు నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రజల ముంగిటకే సంక్షేమ పథకాలను తీసుకెళ్లామని, అయితే కూటమి ప్రభుత్వం రాగానే ఆ పథకాలన్నింటినీ రద్దు చేసి పేదల పొట్ట కొడుతున్నారని విమర్శించారు. ‘ఈ రెండేళ్ల పాలనలో ఎవరికైనా ఒక్క మంచి పని జరిగిందా?’ అని ఆయన ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేసిందని ఆయన గుర్తు చేశారు.
అప్పులపై విమర్శనాస్త్రాలు..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు చెబుతున్న లెక్కలను జగన్ తప్పుబట్టారు. మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరని, సాధారణ వ్యక్తులు ఇలాంటి అబద్ధాలు చెబితే 420 కేసులు పెడతారని ఎద్దేవా చేశారు. తమ ఐదేళ్ల పాలనలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేశామని, ఆ డబ్బు ప్రతి పైసా ఎవరికి వెళ్లిందో, ఏ పథకానికి ఖర్చు చేశామో క్లియర్ కట్ గా చూపించగలమని సవాల్ విసిరారు. కానీ, కూటమి ప్రభుత్వం కేవలం రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ భారీ సొమ్ము ఎక్కడికి పోయిందో, ఎవరి జేబుల్లోకి వెళ్లిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో దోపిడి పాలన..
ప్రస్తుతం రాష్ట్రంలో ‘దోచుకో.. పంచుకో.. తిను’ అనే పద్ధతి సాగుతోందని జగన్ ఆరోపించారు. చివరకు గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా చంద్రబాబు ప్రజలను వంచించారని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, త్వరలోనే వీరికి గుణపాఠం చెబుతారని జగన్ హెచ్చరించారు.