తెలంగాణ కుంభమేళాగా పిలిచే మేడారం మహాజాతర (జనవరి 28 – 31, 2026) ఘనంగా ప్రారంభమైంది. అయితే, దర్శనం కోసం వచ్చే లక్షలాది మంది భక్తులకు స్థానిక వ్యాపారుల ధరల దందా చుక్కలు చూపిస్తోంది. వనదేవతలకు మొక్కుగా సమర్పించే కోళ్లు, మేకల నుంచి మొదలుకొని బస చేసే గదుల వరకు ప్రతిదీ సామాన్యుడికి భారంగా మారింది. చివరకు ఎండ నుంచి సేదతీరేందుకు చెట్టు నీడను ఆశ్రయిస్తే, అక్కడ కూడా అద్దె వసూలు చేస్తుండటం గమనార్హం.
ఆకాశాన్నంటిన మాంసం ధరలు
జాతరలో అమ్మవార్లకు ఇచ్చే బలి మొక్కుల కోసం వినియోగించే మేకలు, కోళ్ల ధరలు రెట్టింపు అయ్యాయి. సాధారణంగా కిలో రూ. 420 పలికే మేకపోతు (లైవ్) ధర, మేడారంలో ఏకంగా రూ. 900 నుండి రూ. 1000 వరకు విక్రయిస్తున్నారు. ఇక మటన్ ధర కిలోకు రూ. 1500 చేరింది. బ్రాయిలర్ కోడి ధర బయట రూ. 170 ఉంటే, ఇక్కడ రూ. 350 పలుకుతోంది. జాతర ముగిసే నాటికి ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భక్తులు వాపోతున్నారు.
చెట్టు నీడకు రూ. 1000 అద్దె!
వసతి సౌకర్యాల విషయంలో దోపిడీ మరీ దారుణంగా ఉంది. కనీస సౌకర్యాలు లేని చిన్న గదులకు కూడా రోజుకు రూ. 6,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇక గదులు దొరకని భక్తులు చెట్ల కింద వంట చేసుకుని సేద తీరదామనుకుంటే, స్థానిక తోటల యజమానులు ఒక్కో చెట్టు నీడకు రూ. 1000 అద్దె వసూలు చేస్తున్నారు. నిత్యావసరాలు, కొబ్బరికాయలు, బెల్లం (బంగారం) ధరలు కూడా ఇష్టానుసారంగా పెంచేయడంతో, అధికారులు తక్షణమే స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.