ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు: రంగంలోకి జనసేన విచారణ కమిటీ.. అప్పటివరకు పార్టీకి దూరం!

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై జనసేన పార్టీ అధిష్టానం కఠిన చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నియమించింది. ఈ కమిటీలో టి.శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి.వరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఎమ్మెల్యే శ్రీధర్ 7 రోజుల్లోగా ఈ కమిటీ ముందు హాజరై తన వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. విచారణ నివేదిక వచ్చే వరకు అరవ శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచాలని అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

బాధితురాలి సంచలన ఆరోపణలు

ఒక ప్రభుత్వ మహిళా ఉద్యోగిని ఎమ్మెల్యే శ్రీధర్‌పై అత్యంత తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా తనను భయపెట్టి ఆయన లైంగిక దాడికి పాల్పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. తన కోరిక తీర్చకపోతే ఆమె మూడేళ్ల కొడుకును చంపేస్తానని బెదిరించారని, ఈ క్రమంలో తాను గర్భవతిని కాగా దాదాపు ఐదుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ స్పందించి, బాధితురాలికి భరోసా ఇచ్చారు.

కుటుంబ సభ్యుల స్పందన

మరోవైపు ఎమ్మెల్యే తల్లి ప్రమీల ఈ ఆరోపణలను ఖండించారు. సదరు మహిళ తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే ట్రాప్ చేసిందని, పెళ్లి చేసుకోవాలని తన కొడుకును వేధించేదని ఆమె పేర్కొన్నారు. ఇది తన కుమారుడి రాజకీయ ఎదుగుదలను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్రగా ఆమె అభివర్ణించారు. కాగా, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు నగరిలో నిరసనలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *