అజిత్ పవార్ చనిపోవడానికి దాదాపు 20 గంటల ముందే వికీపీడియాలో ఆ వార్త అప్‌డేట్ అయ్యిందంటూ సోషల్ మీడియాలో కొన్ని స్క్రీన్ షాట్లు తెగ వైరల్ అవుతున్నాయి. బుధవారం ఉదయం 8:45 గంటలకు ప్రమాదం జరిగితే, మంగళవారం రాత్రే ఆయన పేజీలో మరణించిన తేదీ కనిపించిందని, ఇది పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర అని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే, సాంకేతిక నిపుణులు ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. దీనికి ప్రధానంగా టైమ్ జోన్ల వ్యత్యాసమే కారణమని వారు స్పష్టం చేస్తున్నారు.
నిజానికి వికీపీడియా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం యూటీసీ (Universal Time Coordinated – UTC) సమయాన్ని అనుసరిస్తుంది. మన భారత కాలమానం (IST), యూటీసీ కంటే 5 గంటల 30 నిమిషాలు ముందు ఉంటుంది. ఉదాహరణకు, బుధవారం ఉదయం ఒక యూజర్ పేజీని ఎడిట్ చేస్తే, వికీపీడియా రికార్డుల్లో అది మంగళవారం రాత్రి లేదా బుధవారం తెల్లవారుజాము సమయాన్ని చూపిస్తుంది. ఈ వ్యత్యాసాన్ని గమనించని వారు, ప్రమాదానికి ముందే సమాచారం అప్‌డేట్ అయ్యిందని పొరపడుతున్నారు.
మరోవైపు, వికీపీడియా అనేది ఎవరైనా ఎడిట్ చేయగల ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫారమ్. ప్రమాదం జరిగిన నిమిషాల్లోనే ఎవరో ఒకరు వేగంగా సమాచారాన్ని అప్‌డేట్ చేసి ఉండవచ్చు. అలాగే, బ్రౌజర్‌లో కనిపించే టెక్స్ట్‌ను తాత్కాలికంగా మార్చి స్క్రీన్ షాట్ తీసుకునే ‘ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్’ ట్రిక్ ఉపయోగించి కూడా కొందరు ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏటీసీ (ATC) రికార్డుల ప్రకారం ఇది రన్‌వే సరిగ్గా కనిపించక జరిగిన ప్రమాదమని, వికీపీడియా అప్‌డేట్స్ వెనుక ఎలాంటి కుట్ర లేదని అధికారులు తేల్చి చెప్పారు.