
తేది:25-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్.
మెదక్ జిల్లా: రేపు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ కార్యాలయ పరేడ్ గ్రౌండ్‌లో పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో, సమన్వయంతో పరేడ్ నిర్వహిస్తూ తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
రిహార్సల్స్‌ను జిల్లా అదనపు ఎస్పీ శ్రీ మహేందర్ గారు ప్రత్యక్షంగా పరిశీలించి, పరేడ్ సజావుగా సాగేందుకు అవసరమైన సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అమలు చేయాల్సిన భద్రతా చర్యలు, అతిథుల రాకపోకల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు.
వేడుకలు ప్రశాంతంగా, భద్రతతో నిర్వహించాలనే లక్ష్యంతో ప్రతి విభాగం సమన్వయంతో పనిచేయాలని సూచిస్తూ, విధి నిర్వహణలో అప్రమత్తతతో ఉండాలని ఆయన ఆదేశించారు. ఈ రిహార్సల్స్ ద్వారా గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా, శోభాయమానంగా జరగనున్నాయని అధికారులు తెలిపారు.