నా ప్రెగ్నెన్సీపై తప్పుడు వార్తలు ఆపండి: పుకార్ల రాయుళ్లకు యాంకర్ శివజ్యోతి స్ట్రాంగ్ వార్నింగ్!

బిగ్ బాస్ ఫేమ్, యాంకర్ శివజ్యోతి త్వరలో తల్లి కాబోతున్న తరుణంలో ఆమెపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పెళ్లయిన పదేళ్ల తర్వాత ఆమె గర్భం దాల్చడంతో, కొందరు కావాలనే ఆమె సహజంగా గర్భం దాల్చలేదని, ఐవీఎఫ్ (IVF) లేదా ఐయూఐ (IUI) వంటి పద్ధతుల ద్వారా గర్భవతి అయ్యారంటూ యూట్యూబ్ థంబ్‌నెయిల్స్‌తో ప్రచారం మొదలుపెట్టారు. ఈ వార్తలు తన దృష్టికి రావడంతో శివజ్యోతి తీవ్రంగా స్పందిస్తూ, ఒక వీడియో ద్వారా పుకార్ల రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

తమకు పెళ్లై పదేళ్లు పూర్తయినా, వ్యక్తిగత కారణాల వల్ల 2023 వరకు పిల్లల గురించి ఆలోచించలేదని శివజ్యోతి స్పష్టం చేశారు. ఆ తర్వాత రెండేళ్ల పాటు అనేక ఆసుపత్రులు తిరిగామని, మొక్కని దేవుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తిరుపతి వేంకటేశ్వర స్వామి వ్రతం చేసిన తర్వాతే తాను సహజంగా (Naturally) గర్భం దాల్చినట్లు ఆమె వెల్లడించారు. ఒకవేళ తాను మెడికల్ పద్ధతులను అనుసరించి ఉంటే దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదని, తన శరీరం తన ఇష్టమని ఆమె కుండబద్దలు కొట్టారు.

ప్రస్తుతం తాను ఏడు నెలల గర్భవతినని తెలిపిన శివజ్యోతి, కేవలం డాక్టర్ల సూచనల మేరకే కొన్ని రిపోర్టులను గోప్యంగా ఉంచామని చెప్పారు. “నేను ఎప్పుడు తల్లి కావాలి అనేది నా నిర్ణయం. నా వ్యక్తిగత జీవితంపై ఇష్టం వచ్చినట్లు కథనాలు అల్లకండి” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారికి ఇదే తన చివరి హెచ్చరిక అంటూ శివజ్యోతి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె చేస్తున్న ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *