తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో జనసేన సీనియర్ నాయకుడు, సినీ నటుడు ఆర్‌కే సాగర్ (మొగలిరేకులు ఫేమ్) ఈ విషయాన్ని వెల్లడించారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ గడ్డపై తమ సత్తా చాటేందుకు సిద్ధమయ్యామని ఆయన ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది.
ముఖ్యంగా చేనేత కార్మికుల సమస్యలపై జనసేన ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆర్‌కే సాగర్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, ప్రాంతీయ భేదాలు తమకు లేవని స్పష్టం చేశారు. చేనేతలకు అండగా ఉండాలనే లక్ష్యంతో పవన్ కల్యాణ్ ప్రతి సోమవారం చేనేత వస్త్రాలు ధరిస్తున్నారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో సిరిసిల్ల నేతన్నలకు భరోసా ఇచ్చేందుకు పవన్ కల్యాణ్ స్వయంగా సిరిసిల్లకు వస్తారని ఆయన ప్రకటించడం విశేషం. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ అభ్యర్థులను బరిలోకి దించుతామని ఆయన తెలిపారు.
మున్సిపల్ ఎన్నికల్లో జనసేన ఎంట్రీతో తెలంగాణలో త్రిముఖ పోటీ లేదా చతుర్ముఖ పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మరియు బీజేపీల మధ్య పోరు సాగుతుండగా.. పవన్ కల్యాణ్ ప్రభావం ఉన్న పట్టణ ప్రాంతాల్లో జనసేన ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా. జనసేన ప్రకటనతో తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారాయి.