హైదరాబాద్ గుండెకాయ వంటి నాంపల్లి స్టేషన్ రోడ్‌లో శనివారం సాయంత్రం ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక నాలుగు అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న ఫర్నీచర్ షోరూంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు భవనం అంతటా వ్యాపించాయి. ఈ ఘటనలో సెల్లార్‌లో ఇద్దరు కార్మికులు, ఒక మహిళతో పాటు ఇద్దరు చిన్నారులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. “మేము పని చేసుకుని బతుకుతాం.. లోపల ఉన్న మా పిల్లలను దయచేసి కాపాడండి” అంటూ బాధితులు చేస్తున్న ఆర్తనాదాలు స్థానికులను కలచివేస్తున్నాయి.
ప్రమాద తీవ్రత దృష్ట్యా ఘటనాస్థలికి 10 ఫైర్ ఇంజన్లు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నాయి. భవనం మొత్తం అద్దాలతో నిర్మించి ఉండటం, లోపల ఫర్నీచర్ మరియు రసాయనాలు ఉండటంతో దట్టమైన పొగ అలుముకుంది. దీంతో రెస్క్యూ ఆపరేషన్ చేయడం సిబ్బందికి కష్టతరంగా మారింది. భవనం పైన ముగ్గురు వ్యక్తులు స్పృహతప్పి పడిపోయినట్లు సమాచారం అందుతోంది. లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు అగ్నిమాపక సిబ్బంది కాంప్లెక్స్ అద్దాలను పగలగొడుతున్నారు.
పరిస్థితిని పర్యవేక్షించేందుకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా ఘటనాస్థలికి చేరుకున్నారు. పొగ కారణంగా లోపలికి వెళ్లడం సాధ్యం కాకపోవడంతో, అత్యాధునిక రోబో యంత్రాన్ని రెస్క్యూ ఆపరేషన్‌లో వినియోగిస్తున్నారు. ప్రస్తుతం నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్‌ను పోలీసులు దారి మళ్లించారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. భవనంలో చిక్కుకున్న వారిని కాపాడటమే తమ మొదటి ప్రాధాన్యత అని అధికారులు వెల్లడించారు.