పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవ పాత్ర పోషించిన సహాయ నటుడు జగదీశ్‌ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. జగదీశ్ తన సినిమా పాత్ర కేశవ పేరుతో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప -2 సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఒక మహిళ మరో వ్యక్తితో ఉన్నప్పుడు తీసిన ఫొటోను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను జగదీశ్ బ్లాక్ మెయిల్ చేయగా.. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పోలీసులు విచారణ చేయగా.. చనిపోయిన మహిళకు ‘పుష్ప’ ఫేమ్ జగదీశ్‌కు సినీ రంగంలో పరిచయముందని తెలిసింది. నవంబర్ 27న ఆ మహిళ మరో వ్యక్తితో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమెకు తెలియకుండా జగదీశ్ వారిద్దరి ఫొటో తీశాడని.. ఆ ఫొటో త్వరలోనే సోషల్ మీడియాలో పెడతానని ఆమెకు బెదిరించేవాడు.. అయితే ఆమె జగదీశ్ పెట్టే వేధింపులు భరించలేక నవంబర్ 27న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో పోలీసులు జగదీశ్‌పై కేసు నమోదు చేసి.. అతని కోసం గాలిస్తున్నారు.
కానీ జగదీశ్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే పంజాగుట్ట పోలీసులు అతడిని బుధవారం పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన తరువాత అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.