డీప్ ఫేక్.. రష్మిక, అలియా భట్, కాజోల్, కత్రినా కైఫ్ ఇలా హీరోయిన్లంతా డీప్ ఫేక్ బారిన పడ్డారు. తొలుత రష్మిక డీప్ ఫేక్ వీడియో వైరల్ తో మొదలైన ఈ విషయం క్రమంగా బాలీవుడ్ భామలందరినీ కుదిపేస్తోంది. వారి డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలు విపరీతంగా వైరల్ అవ్వడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీప్ ఫేక్ వీడియోలను చిత్రీకరించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ.. తాజాగా బాలీవుడ్ అగ్రహీరోయిన్ ప్రియాంక చోప్రా డీప్ ఫేక్ వీడియో వైరల్ అవ్వడం మళ్లీ ఆందోళన కలిగిస్తోంది.
ప్రియాంక చోప్రాకు సంబంధించిన డీప్ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో ప్రియాంక మాట్లాడిన ఓ వీడియోలో ఆమె ముఖాన్ని మార్చకుండా.. వాయిస్ ను మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒక నకిలీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తున్నట్లు లిప్ సింక్ చేశారు. అలాగే వార్షిక ఆదాయాన్ని వెల్లడించినట్లు వీడియో రూపొందించారు. ఒక బ్రాండ్ కారణంగా 2023లో వార్షిక ఆదాయం భారీగా పెరిగిందని, అందరూ దానిని ఉపయోగించాలని ప్రియాంక చెప్పినట్లుగా ఆ వీడియోను క్రియేట్ చేశారు. ఈ వీడియో నెట్టింట హల్ చేస్తుండగా.. పలువురు స్పందిస్తూ.. ఇలా చేయడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీప్ ఫేక్ క్రియేట్ చేసే ఆకతాయిలపై చర్యలు తీసుకుంటున్నా.. ఆకతాయిలు భయపడటం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.